టికెట్ నిరాకరణ.. రెబల్ అభ్యర్థిగా భవాని!
దేవెగౌడ ‘కుటుంబ రాజకీయం’లో కీలక మలుపు. కోడలు భవానీ రేవన్నకు టికెట్
ఇచ్చేందుకు నిరాకరించిన జేడీఎస్ అధినేత. ఆమె పోటీ చేయాలని అనుకున్న
నియోజకవర్గానికి మరో వ్యక్తిని అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇప్పుడు భవాని
స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా లేక పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన
వ్యక్తికి మద్దతిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
కోడలు భవానీ రేవన్నకు తీవ్ర నిరాశ మిగుల్చుతూ కర్ణాటక శాసనసభ ఎన్నికల
అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేశారు జేడీఎస్ అధినేత దేవెగౌడ. భవాని పోటీ
చేయాలనుకున్న హసన్ నియోజకవర్గానికి హెచ్‌పీ స్వరూప్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు.
హసన్ సహా కర్ణాటకలోని 49 స్థానాలకు అభ్యర్థుల పేర్లను శుక్రవారం ప్రకటించారు.
ఈ పరిణామం దేవెగౌడ కుటుంబ రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందనేది
ఆసక్తికరంగా మారింది.
అనేక రోజులుగా తర్జనభర్జన
కర్ణాటకలోని 224 శాసనసభ నియోజకవర్గాలకు మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల
షెడ్యూల్ వెలువడడానికి అనేక నెలల ముందే 2022 డిసెంబర్లో అభ్యర్థుల తొలి జాబితా
విడుదల చేసింది జేడీఎస్. మొదటి విడతలో 93 మంది పేర్లు ఖరారు చేసింది. ఈ నెల
4నే రెండో జాబితా వస్తుందని తొలుత అంతా భావించారు. అయితే భవానీ రేవన్నకు
టికెట్ ఇవ్వడంపై దేవెగౌడ కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఫలితంగా టికెట్ల
కేటాయింపు ఆలస్యమైంది. దేవెగౌడ కుమారుల్లో ఒకరైన రేవన్న భార్య భవాని హసన్
జిల్లా పంచాయతీ మాజీ సభ్యురాలు. ఆమె కుమారుడు ప్రజ్వల్ హసన్ నుంచి లోక్‌సభకు
ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో కుమారుడు సూరజ్ కర్ణాటక శాసన మండలి సభ్యుడు.
త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ.. జేడీఎస్ వర్గాల్లో భవాని పేరు
మార్మోగింది.
హసన్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ దిగాలని భవాని భావించడం అందుకు ఆమె భర్త
రేవన్న, కుమారులు ప్రజ్వల్, సూరజ్ మద్దతు పలకడం చర్చనీయాంశమైంది. ఇదే జేడీఎస్
అగ్రనేత దేవెగౌడకు తలనొప్పిగా మారింది. హసన్ నుంచి భవాని పోటీ చేసేందుకు
దేవెగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మొదటి నుంచి ఏమాత్రం సుముఖంగా
లేరు. పార్టీకి విధేయుడైన కార్యకర్తను అభ్యర్థిగా నిలపాలని ఆయన వాదిస్తూ
వచ్చారు. ఇదే విషయమై దేవెగౌడ సమక్షంలో కుమారస్వామి, రేవన్న కుటుంబసభ్యుల మధ్య
విస్తృత చర్చలు జరిగాయి. టికెట్ విషయంలో రెండు వర్గాలు వెనక్కు తగ్గడం లేదని
అప్పట్లో వార్తలు వచ్చాయి. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు భవాని
సిద్ధపడ్డారన్న ఊహాగానాలు వినిపించాయి.చివరకు కుమారస్వామి మాట నెగ్గింది. ఆయన
ప్రతిపాదించినట్లుగానే హసన్ నియోజకవర్గ అభ్యర్థిగా హెచ్.పి.స్వరూప్ పేరు
ఖరారైంది. స్వరూప్.. మాజీ ఎమ్మెల్యే, దివంగత హెచ్.ఎస్. ప్రకాశ్ కుమారుడు.
గతంలో స్వరూప్ హసన్ జిల్లా పంచాయతీ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. కుమారస్వామి
మద్దతు ఉన్నందున టికెట్ ఖాయమనే ఆశతో.. ఎప్పటి నుంచో హసన్ నియోజకవర్గంలో
విస్తృతంగా పర్యటిస్తున్నారు.
హసన్.. జేడీఎస్ అధినేత దేవెగౌడ సొంత జిల్లా. అక్కడ వొక్కలిగల ప్రాబల్యం
ఎక్కువ. ఈ జిల్లాలో 7 శాసనసభ స్థానాలు ఉన్నాయి. 2018లో జరిగిన ఎన్నికల్లో హసన్
నియోజకవర్గం తప్ప మిగిలిన 6 సీట్లను జేడీఎస్ గెలుచుకుంది. హసన్ నుంచి బీజేపీ
అభ్యర్థి ప్రీతమ్ గౌడ విజయం సాధించారు. ఆ జిల్లాలో కమలదళానికి దక్కిన తొలి
సీటు ఇదే కావడం విశేషం.మరోవైపు.. కుమారస్వామి చన్నపట్న స్థానం నుంచి బరిలోకి
దిగుతున్నారు. ఏప్రిల్ 19న నామినేషన్ వేస్తానని ఇప్పటికే ప్రకటించారు.
కుమారస్వామి కుమారుడు నిఖిల్.. ఏప్రిల్ 17న రామనగర అభ్యర్థిగా నామపత్రాలు
సమర్పిస్తారని చెప్పారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల పోలింగ్ మే 10న జరగనుంది. మే
13న ఫలితం వెలుడవనుంది.