త్వరలో విశాఖలో కెసిఆర్ తో భారీ భహిరంగ సభకు సన్నాహలు
ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్
విశాఖపట్నం : తెలుగువారి మనోభావాలను కించపరిచేలా కేంద్రంలోని బిజెపి
ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్ శక్తులకు దొడ్డిదారిన
కట్టబెట్టాలని చూస్తే భారత రాష్ట్ర సమితి మహాపోరాటానికి శ్రీకారం చుడుతుందని
ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్ఠం చేశారు. సోమవారం
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చేపట్టిన దీక్ష 788 రోజుకు చేరింది. దీక్షలో
పాల్గొన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు,కార్మికులకు సంఘీభావం తెలుపుతూ డాక్టర్
తోట దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడి ప్రభుత్వ
రంగా సంస్థ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను తన అనుయాయుడైన అదానికి దొడ్డి దారిన
దోచిపెట్టే కుట్రలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ను
ప్రైవేటీకరిస్తే ప్లాంట్ పై ఆధారపడి జీవించే లక్ష కుటుంబాలు రోడ్డున పడే
దుర్ధర పరిస్తితులు కేంద్రం కల్పించబోతోందని వాపోయారు. రాష్ట్రపతి పేరు
మీదున్న విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని ఆర్ఎన్ఎల్ కు బదిలీ చేయించాలని డిమాండ్
చేశారు. అమరావతి రాజధాని శంఖుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడి నిధులివ్వకుండా
గుప్పెడు మట్టి చెంబుడు నీళ్ళు తెచ్చారని ఎద్దేవా చేశారు.
విశాఖనగరంలో త్వరలో బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసిఆర్ తో భారీ బహిరంగ సభ
నిర్వహించేలా పార్టీ శ్రేణులు సమాయత్తమౌతున్నాయన్నారు. బిజెపి హఠావో దేశ్
బచావో అంటూ దేశ ప్రజల్లో చైతన్యం మొదలైందని ఘాటుగా విమర్శించారు.బి ఆర్ ఎస్
రాష్ట్ర నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్
పరిరక్షణకు కలసి వచ్చే ఏ పార్టీతో నైనా కలసి నడిచేందుకు తాము సిద్దంగా
ఉన్నామన్నారు. తొలుత విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలు తమ దీక్షకు
సంఘీభావం తెలిపేందుకు వచ్చిన తోట చంద్రశేఖర్ కు ఘనస్వాగతం పలికారు. జై కేసీ
ఆర్ , జై తోట అనే నినాదాలతో దీక్ష శిబిరం వద్ద హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో
ఉక్కు పరిరక్షణ పోరాట సమితి అధ్యక్షుడు ఆద్దినారాయణ ,ఐ ఎన్ టి యు సి నేత
మంత్రి రాజశేఖర్, బి ఆర్ ఎస్ నాయకులు గాదె బాలాజీ , తలారి సురేష్, తాడువాక
రమేష్ నాయుడు, కారణం రామ్మోహన్ నాయుడు ,పెద్ద ఎత్తున బి ఆర్ ఎస్ శ్రేణులు ,
స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.