ఎదురవుతాయని భావించే నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇది ఎంతవరకు
అనుకూల ఫలితాలనిస్తుంది? పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ కర్ణాటక రాజకీయాలు కీలక మలుపులు
తిరుగుతున్నాయి. వివిధ కారణాలతో పెద్ద సంఖ్యలో నాయకులు పార్టీలు
మారుతున్నారు). సొంత పార్టీ నుంచి విముఖత ఎదురై కొందరు, ఇతర పార్టీల్లో రాజకీయ
భవిష్యత్‌ను ఊహించుకొని మరికొందరు పక్క చూపులు చూస్తున్నారు. కర్ణాటక
ఎన్నికల్లో ప్రధాన పోటీలో నిలిచిన భాజపా, కాంగ్రెస్ ఇరువైపుల నుంచి కూడా
పార్టీ ఫిరాయింపులు ఎక్కువవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌లో సీట్ల కోసం తీవ్ర
పోటీ ఏర్పడింది. దీంతో ఆ పార్టీలో ఆశావహులు ప్రత్యర్థి పార్టీలతో మంతనాలు
సాగిస్తున్నారు. ఈ రెండు పార్టీల నుంచి నేతలను తమవైపు తిప్పుకొని… ప్రభుత్వ
ఏర్పాటులో కీలకంగా మారేందుకు హెచ్ డీ దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్
సెక్యులర్ (జేడీఎస్) ప్రయత్నిస్తోంది.సీటు సాధిస్తే చాలు గెలిచినట్లే : గతంతో పోలిస్తే ఈసారి కర్ణాటక ఎన్నికల
వాతావరణం భిన్నంగా కనిపిస్తోంది. గెలుపు ఓటముల మాట అటుంచింతే..సీటు సంపాదిస్తే
చాలు.. గెలిచినట్లే.. అన్నంతలా మారిపోయింది. పార్టీ టికెట్ల కోసం తీవ్ర పోటీ
ఏర్పడింది. సొంత పార్టీ నేత కాకపోయినప్పటికీ.. ఆ నాయకుడికి ప్రజల్లో ఉన్న
ఆదరణ, గెలుపు అవకాశాలను అంచనా వేసుకొని టికెట్లు కేటాయించేందుకు ప్రత్యర్థి
పార్టీలు కూడా ముందుకొస్తున్నాయి. దీంతో పలువురు నాయకులు పార్టీ మారేందుకు
మొగ్గు చూపుతున్నారు. మరోవైపు రానున్న వారం పదిరోజుల్లో పార్టీ జంపింగ్‌లు
అధికం కావొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు కేవలం
కాంగ్రెస్, జేడీఎస్ మాత్రమే కొన్ని స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు
చేశాయి. అధిష్ఠానం నుంచి సరైన ఆదేశాలు రాకపోవడంతో భాజపా ఇంతవరకు అభ్యర్థుల
పేర్లను ప్రకటించలేదు. ఈ ప్రక్రియ పూర్తయినట్లయితే.. భాజపాతోపాటు కాంగ్రెస్,
జేడీయూ నుంచి కూడా నాయకులు ఫిరాయింపులు చేపట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
ఎవరి ప్రయత్నాలు వారివి : దక్షిణాదిలో నిలదొక్కుకునేందుకు అవకాశం ఉన్న
రాష్ట్రం కావడంతో కర్ణాటకలో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని భాజపా
ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరోవైపు గత ఎన్నికల్లోని ఓటమి నుంచి పాఠాలు
నేర్చుకున్న కాంగ్రెస్ తన తప్పులను సరిదిద్దుకొని విజయాన్ని ‘హస్తగతం’
చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. జేడీఎస్ కూడా ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కావాలనే
ఉద్దేశంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అధ్యక్షులు కూడా ఇతర పార్టీల నుంచి
సమర్థవంతమైన అభ్యర్థులు వస్తే వెంటనే చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మూలాలు బలంగా ఉన్న నేతలకు కూడా
కాంగ్రెస్ తమ పార్టీలోకి ఆహ్వానించి.. సీట్లు కేటాయించింది. తుమకూరు జిల్లా
చిక్కనాయనహల్లికి చెందిన కేఎస్ కిరణ్‌కుమార్, మహదేవ్పుర నియోజకవర్గానికి
చెందిన నగేశ్, రాజాజీనగర్‌కు చెందిన పుట్టన్నలకు కాంగ్రెస్ తొలిజాబితాలోనే
సీట్లు కేటాయించింది.
కాంగ్రెస్‌లో నిరసన సెగ : మరోవైపు కేపీసీసీ అధ్యక్షుడు డికే శివకుమార్
తీసుకుంటున్న నిర్ణయాలపై పార్టీలో అంతర్గతంగా చిచ్చురేగుతోంది. ఇప్పటికే 124
స్థానాలకు తొలి విడత జాబితా ప్రకటించడం.. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి
వస్తున్న వారి సంఖ్య అధికమవ్వడంతో పార్టీలోని కొందరు కీలక నేతలకు రిక్తహస్తాలు
ఎదురవుతాయనే పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆయా నేతల మద్దతుదారులు
కేపీసీసీ కార్యాలయం ఎదుట సోమవారం నిరసనకు దిగారు. అలాంటి వారికి సీట్లు
కేటాయించకపోతే పార్టీ నుంచి ఫిరాయించడమో, లేదంటే రెబల్స్‌గా పోటీకి దిగే
అవకాశాలు కనిపిస్తున్నాయి.
భాజపాపై వ్యతిరేకత : ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర ప్రభుత్వంపై
పెరుగుతున్న వ్యతిరేకతతో కొంత మంది భాజపా నేతలు..కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు
సిద్ధమవుతున్నారు. దీనిపై ఇప్పటికే కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌తో చర్చలు
జరుపుతున్నట్లు సమాచారం. సీట్ల కేటాయింపు అంశాన్ని భాజాపా అధిష్ఠానం ఓ
కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత.. పార్టీ నుంచి చాలా మంది ఫిరాయించే అవకాశాలు
కనిపిస్తున్నాయి. హిరెకెరూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే యూబీ బనకర్, చిక్‌మగళూరు
నియోజకవర్గ ఎమ్మెల్యే తమ్మన్న, ధార్వాడ్ ఎమ్మెల్యే మోహన్ లింబికాయ్
ఇప్పటికే ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. వీళ్లంతా
మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప మద్దతుదారులు కావడం గమనార్హం. వీరితోపాటు
షిగ్గాన్ నియోజకవర్గం నుంచి మంజునాథ్ కన్నూర్, కుడ్లిగి ఎమ్మెల్యే ఎన్వై
గోపాలకృష్ణ కూడా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. మరోవైపు గృహనిర్మాణశాఖ మంత్రి
సోమన్న కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. విషయం
దిల్లీ దాకా చేరడంతో ఇటీవల సోమయ్యకు కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా నుంచి
పిలుపు వచ్చింది. కొంతమంది సీనియర్ నేతల పిల్లలకు టికెట్లు కేటాయించే
అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పిన అమిత్ షా.. సోమన్న కుమారుడికి టికెట్
ఇచ్చే అంశంపై భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఓ స్పష్టత వచ్చాకనే సోమన్న
పార్టీలో కొనసాగుతారా? లేదా అనే విషయం తెలియనుంది.
మాటల తూటాలు : పార్టీలో అస్థిరత సృష్టించాలనే ఉద్దేశంతో కేపీసీసీ అధ్యక్షుడు
శివకుమార్.. భాజపా నేతలకు మాయమాటలు చెప్పి పార్టీలో చేర్చుకుంటున్నారని
ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆరోపిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ కూడా తనదైన
శైలిలో బదులిస్తోంది. 2019నాటి పరిస్థితులను గుర్తు చేసుకోవాలని
హితవుపలికింది. ఆపరేషన్ లోటస్ పేరుతో 17 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి
అక్రమంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది భాజపా కాదా? అంటూ శివకుమార్
ఆరోపించారు. 2019లో భాజపాలోకి 17 మంది ఎమ్మెల్యేలు వెళ్లగా.. అందులో 14 మంది
కాంగ్రెస్ నుంచి వెళ్లిన వారే. అప్పటి భాజపా యాక్షన్‌కు.. ఇప్పుడు కాంగ్రెస్
రియాక్షన్ చూపిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఈ రాధాకృష్ణ
విమర్శించారు. జేడీఎస్ కూడా తక్కువేం కాదు : భాజపా, కాంగ్రెస్ మధ్య ప్రధాన
పోటీ ఉండటంతోపాటు.. ఆయా పార్టీల నుంచి ఫిరాయింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ
పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవాలని జేడీఎస్ భావిస్తోంది. భాజపా నుంచి
జేడీఎస్‌లోకి వచ్చిన మంజుకు అరకల్గూడ్ నియోజకవర్గ స్థానాన్ని కేటాయించింది.
ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామస్వామి ఎమ్మెల్యే పదవికి రాజీనామా
చేసి భాజపాలో చేరడంతో ఆ స్థానాన్ని జేడీఎస్ మంజుతో భర్తీ చేసింది. 2019
ఎన్నికల్లో మంజు లోక్‌సభ స్థానానికి పోటీ చేసి.. మాజీ ప్రధాని హెడ్డీ దేవెగౌడ
మనవడు ప్రజ్వల్ రేవన్న చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే మంజు తనయుడు మంథర్
గౌడ మదికేరి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ సీటుకోసం పోటీ పడుతుండటం
గమనార్హం. మరోవైపు ఈ పార్టీ నుంచి కూడా నాయకులు పక్కదారి పడుతున్నారు. గుబ్బి
నియోజకవర్గ జేడీఎస్ ఎమ్మెల్యే ఎస్ఆర్ శ్రీనివాస్, ఆర్సికరే ఎమ్మెల్యే కేఎం
శివలింగ గౌడలకు కాంగ్రెస్ సీట్లు కేటాయించింది. చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ
దేవెగౌడ జేడీఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. అయితే, పార్టీ
అధిష్ఠానం కలుగజేసుకొని శాంతపరిచనట్లు తెలుస్తోంది. కుమారుడికి సీటు
కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కితగ్గినట్లు సమాచారం.
పార్టీ ఫిరాయింపులు కొత్తేం కాదు : రాజకీయాల్లో పార్టీలు మారటం, రెబల్స్‌గా
బరిలోకి దిగడం కొత్తేం కాదు. అయితే, భారత్ లాంటి అదిపెద్ద ప్రజాస్వామ్య
దేశంలో జంపింగ్ జిలానీలు ఎక్కువగా పార్టీలు మారుతుంటారు. ఏఐసీసీ మాజీ
అధ్యక్షుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి నిజలింగప్పకు అప్పటి ప్రధాని ఇందిరా
గాంధీతో భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో బెంగళూరులోని లాల్‌బాగ్‌లో కొంతమంది
పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
పేరిట కొత్త పార్టీని స్థాపించారు. మరోవైపు 2012లో కర్ణాటక జనతా పక్ష
(కేజేపీ) పేరుతో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కొత్త పార్టీని స్థాపించారు. ఆ
తర్వాత 2014లో భాజపాలో చేరిపోయారు. ప్రస్తుత రవాణాశాఖ మంత్రి బి.శ్రీరాములు
బడవర శ్రామిక రైతర కాంగ్రెస్ పేరిట 2011లో కొత్తపార్టీని స్థాపించారు. తాజాగా
ఆయన స్నేహితుడు గాలి జనార్ధన్ రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరిట మరో
పార్టీ పెట్టారు. ఇలా.. ఎన్నికల సమయంలో కొత్త పార్టీలు రావడం, పలువురు నేతలు
పార్టీలు మారటం కొత్తేం కాదు. అయితే, అలాంటి వారిని ప్రజలు ఎంతవరకు
ఆదరిస్తారు. తర్వాతి కాలంలో పార్టీలో వారికి ప్రాధాన్యత ఉంటుందా? లాంటి అంశాలే
కీలకం.