ఎన్నిక ఏదైనా ‘శాసించేది వారే!’
బెంగుళూరు : కర్ణాటక చరిత్రలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించిన సామాజిక
వర్గమది. 9 శతాబ్దాల క్రితమే సమాజంలో నెలకొన్న వివక్షకు, కరడుగట్టిన
సంప్రదాయాలకు వ్యతిరేకంగా గళమెత్తి బడుగు వర్గాలకు అండగా నిలిచింది. బసవన్న
ఆదర్శాలతో సకల వర్గాల ఆదరణను చూరగొంది. లింగాయత్ లేదా వీరశైవ లింగాయత్‌లుగా
పేరొందిన ఈ సామాజిక వర్గం ఆధునిక రాజకీయాల్లోనూ తనదైన విశిష్టతను
నిలుపుకుంటోంది. రాష్ట్రంలో పెద్ద సామాజిక వర్గంగా ఉన్న లింగాయత్‌లు అసెంబ్లీ
ఎన్నికల్లో పార్టీల గెలుపోటములను శాసిస్తారు. మొత్తం 224 శాసనసభ నియోజక
వర్గాలకు గాను వంద స్థానాల్లో వీరి ప్రభావం అధికం. రాష్ట్ర జనాభాలో 17 శాతం
మంది లింగాయత్‌లు కాగా వక్కళిగలు 15 శాతం, ఓబీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలు 18
శాతం, ముస్లింలు 12.92 శాతం, బ్రాహ్మణులు 3 శాతంగా ఉన్నారు. అయితే, 2013 నుంచి
2018 వరకు రాష్ట్రంలో నిర్వహించిన కులాల వారీ జనాభా లెక్కల ప్రకారం
లింగాయత్‌లు 9 శాతం, వక్కళిగలు 8 శాతానికి పరిమితమైనట్లు సమాచారం. ఈ నివేదిక
ఇంకా వెల్లడి కాలేదు. ప్రస్తుత అసెంబ్లీలో 54 మంది లింగాయత్ ఎమ్మెల్యేలుంటే
వీరిలో 37 మంది భాజపాకు చెందినవారే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు లింగాయత్
మఠాలు కూడా రాజకీయంగా ప్రభావితం చేస్తాయి. లింగాయత్‌లలో ఉండే ఉప కులాలదీ ముఖ్య
భూమికే. విద్య, ఉద్యోగాల్లో అధిక వాటా కోరుతూ ఆందోళనకు దిగడంతో సర్కారు
రాష్ట్ర ఓబీసీ జాబితాలో లింగాయత్‌లకు ఉన్న రిజర్వేషన్‌ను మరో 2 శాతం పెంచాలని
నిర్ణయించింది.
ఆ తప్పిదం.. హస్తం పాలిట శాపం : వాస్తవానికి 1989 వరకు లింగాయత్‌లు
కాంగ్రెస్‌కు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉండేవారు. లింగాయత్ వర్గానికి చెందిన
వీరేంద్ర పాటిల్ నాయకత్వంలో 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 224
స్థానాలకు 178 చోట్ల విజయఢంకా మోగించింది. అయితే, 1990లో పాటిల్
అనారోగ్యానికి గురై కోలుకుంటున్న సమయంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్
గాంధీ వెనుకబడిన తరగతులకు చెందిన ప్రముఖ నేత బంగారప్పను సీఎంగా నియమించారు.
కర్ణాటక రాజకీయ చరిత్రలో దీన్ని కీలక మలుపుగా చెప్పుకుంటారు. ఈ పరిణామం
కాంగ్రెస్‌కు లింగాయత్‌లను దూరం చేసింది. ఆ తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ 34 స్థానాలకు పరిమితమైంది. ఈ సామాజిక వర్గానికి చెందిన
యడియూరప్ప బీజేపీ అగ్రనేతగా ఎదిగారు.
*కాంగ్రెస్ ఆకర్షణ యత్నాలు : గతంలో తమ ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్‌లను
తిరిగి ఆకట్టుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. లింగాయత్ ఎమ్మెల్యే
ఎం.బి.పాటిల్‌ను 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా కాంగ్రెస్
నియమించింది. మరో లింగాయత్ ఎమ్మెల్యే ఈశ్వర్ ఖండ్రేను కర్ణాటక కాంగ్రెస్
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది. మేలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో
లింగాయత్‌లను ప్రసన్నం చేసుకునేందుకు అటు బీజేపీ , ఇటు కాంగ్రెస్
పోటీపడుతున్నాయి.