న్యూఢిల్లీ : సువిశాల తీర ప్రాంతం కల్గిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోర్టులు
వాటి సమీపంలోని పట్టణాలు అనుసంధానం చేసే దిశగా దీర్ఘకాలిక ప్రణాళికతో
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర ప్రాంత అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని
రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శుక్రవారం పలు అంశాలు వెల్లడించారు.
సాగరతీరాల్లో రూ.18896 కోట్లతో 446 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు
విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 22
ప్రాజక్టులపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
పోలవరం తాజా అంచనాలను కేంద్రం ఆమోదించాలి
పోలవరం ప్రాజక్టుకు సంబంధించి టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ నిర్ధారించిన
రూ.55548 కోట్ల తాజా అంచనాలకు కేంద్రం తక్షణమే అమోదించాలని ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. అడ్ హక్ గా
రూ.10వేల కోట్లు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే రిసోర్స్ గ్యాప్
ఫండింగ్ కింద 36625 కోట్లు ఇవ్వాలని, ఏపీకి రావలసిన బకాయిలు వెంటనే విడుదల
చేయాలని కోరారని అన్నారు. ఇటీవల ఢిల్లీ అధికారిక పర్యటనలో భాగంగా కేంద్ర
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలతో జరిగిన భేటీలో
రాష్ట్రానికి సంబంధించిన అంశాలను చర్చించినట్లు తెలిపారు.
జిల్లా స్థాయిలో ఎక్స్ పోర్టు హబ్స్
దేశవ్యాప్తంగా జిల్లా స్థాయి ఎక్స్ పోర్టు హబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా అన్ని
రకాల వర్తకులు, వ్యాపారులు, చిన్న పెద్ద పారిశ్రామికవేత్తలు ఎంతగానో లబ్ధి
పొందుతారని విజయసాయి రెడ్డి అన్నారు. జిల్లా స్థాయి ఎక్స్ పోర్టు హబ్స్
ఏర్పాటు చేయడం ద్వారా ఆయా జిల్లాలకు సంబంధించిన ఉత్పత్తులు సులబంగా ఎగుమతి
చేసుకోవచ్చని అన్నారు. తద్వారా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పథకం కూడా
ఫలవంతం అవుతుందని విజయసాయి రెడ్డి అన్నారు.