న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమారిపై నిర్వహించిన సమగ్ర అధ్యయనంతో ఎటువంటి చర్యలు
తీసుకున్నారని? నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్ వద్దభలో సోమవారం
అడిగారు. ఈ ప్రతికూల ఆర్థిక ప్రభావాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం ఏదైనా
ప్రపంచ సహాయం తీసుకుందా? అని కూడా ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక శాఖ ఉప మంత్రి
పంకజ్ చౌదరి దీనికి రాతపూర్వకంగా సమాధానం ఇస్తూ కోవిడ్-19 మహమ్మారి ప్రభావంపై
ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా వేస్తోందని తెలిపారు. అందులో భాగంగానే భారీ
టీకా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. గత మూడు బడ్జెట్లలో
ఆర్థిక వ్యవస్థను ఉద్దీపనం చేసేందుకు మూలధన వ్యయాన్ని 30-35 శాతం పెంచినట్లు
తెలిపారు. అలాగే రాష్ట్రాలకు కూడా గణనీయమైన సహాయాన్ని అందించినట్లు
పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు క్రెడిట్ లింక్ గ్యారెంటీ
స్కీంను ప్రారంభించామని, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా పేదలు,
వృద్ధులు, వితంతువులకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించినట్లు తెలిపారు.
ప్రపంచ సహాయాన్ని పొంది, మరెన్నో ఉపశమన చర్యలను తీసుకున్నట్లు పేర్కొన్నారు.