లండన్ లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పేదిలేదని స్పష్టీకరణ
తానేం ఆందోళనగా లేనని, ఉత్సాహంగా ఉన్నానని వెల్లడి
న్యూ ఢిల్లీ: లోక్ సభ సభ్యుడిగా తనపై అనర్హత వేటు పడిన తర్వాత కాంగ్రెస్ నేత
రాహుల్ గాంధీ తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన
కార్యాలయంలో మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. లండన్ లో తను చేసిన వ్యాఖ్యలకు
క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు.
‘‘ప్రధాని నా ప్రసంగానికి భయపడటంతోనే నాపై అనర్హత వేటు వేశారు.. మోదీ కళ్లలో
భయం కనిపించింది. అందుకే నేను పార్లమెంట్లో మాట్లాడకూడదని వాళ్లు
అనుకుంటున్నారు’’ అని రాహుల్ చెప్పారు. లండన్ లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు
చెప్పాలన్న బీజేపీ డిమాండ్ పై స్పందిస్తూ.. ‘‘నా పేరు సావర్కర్ కాదు.. నేను
గాంధీని.. క్షమాపణలు చెప్పబోను’’ అని స్పష్టం చేశారు. తనను అనర్హుడిగా
ప్రకటించడంపై స్పందిస్తూ.. ‘‘నేను ఆందోళనగా కనిపిస్తున్నానా? నిజానికి
ఉత్సాహంగా ఉన్నా’’ అని చెప్పారు.
భారతదేశ వ్యవహారాల్లో అంతర్జాతీయ శక్తులు జోక్యం చేసుకోవాలని తాను
వ్యాఖ్యానించినట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. తనపై వస్తున్న
ఆరోపణలపై సభలో వివరణ ఇచ్చేందుకు అవకాశం కోరానని, కానీ తనకు అవకాశం ఇవ్వలేదని
చెప్పారు.