న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా ఇండియా 2023లో
అవతరిస్తుందని ఆర్దిక నిపుణులు అంచనా వేస్తున్నారని రాజ్యసభ సభ్యులు, వైసీపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల
వేదికగా బుధవారం పలు అంశాలు వెల్లడించారు. ఈ సందర్బంగా భారతదేశ ఆర్థిక
చరిత్రపై అర్థశాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. మౌర్య చక్రవర్తులైన
చంద్రగుప్తుడు, అశోకుడి కాలంలో ప్రపంచ స్థూల వస్తు సేవల ఉత్పత్తిలో (జీడీపీ)
ఇండియా వాటా 32 శాతం అని ఆర్థిక చరిత్రకారులు అంచనావేశారు. అప్పుడు ప్రపంచ
జనాభాలో మూడో వంతు జనం భారతదేశంలో నివసించేవారట. ఇక ప్రస్తుత భారత ఆర్థిక
పరిస్థితి పరిశీలిస్తే అనేక సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. గత పదేళ్లలో
భారతదేశ వినియోగదారుల మార్కెట్ సైజు దాదాపు రెట్టింపు అయి 2.1 లక్షల కోట్ల
అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అంటే 2012 నుంచి ఒక దశాబ్ద కాలంలో వినియోగదారుల
మార్కెట్ రెట్టింపు అయింది. ప్రపంచంలో పదో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్
స్థాయి నుంచి నేడు ఇండియా నాలుగో అతిపెద్ద వినియోగదారుల విపణి అయింది. వచ్చే
పాతికేళ్లలో దేశ జనాభా మరో 24 కోట్లు పెరుగుతుందని అంచనా. దీని కారణంగా 2047
నాటికి భారత వినియోగదారుల మార్కెట్ ప్రస్తుతమున్న సైజుకు 9 రెట్లు పెరిగే
అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని అంచనావేస్తున్నారు. అప్పుడు భారత
వినియోగదారుల మార్కెట్ సైజు 18.5 లక్షల కోట్ల డాలర్లకు పెరుగుతుంది.
మార్కెట్ విషయంలో ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత ఇండియా మూడో స్థానం
ఆక్రమిస్తుంది. దేశ జనసంఖ్య పెరుగుతున్న కారణంగా వస్తుసేవలకు డిమాండు కూడా
పెరుగుతూనే ఉంటుందని విజయసాయి రెడ్డి అన్నారు.
మార్కెట్ సైజుతో పాటు ఉపాధికి కూడా పెరగనున్న డిమాండ్
భారత జనసంఖ్య పెరుగుదలతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కూడా డిమాండ్
పెరుగుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. 2047 నాటికి దేశంలో పనిచేసే వయసున్న
జనాభా (15–64 మధ్య వయస్కులు) 110 కోట్ల మంది ఉంటారు. ఆర్థికాభివృద్ధి నిలకడగా
సాగుతున్నా పనిచేసే వయసు జనులందరికీ ఉద్యోగాలు కల్పించడం కష్టమైన పనే.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వచ్చే పాతికేళ్లలో దేశంలో 23 కోట్ల ఉద్యోగాలు
సృష్టించాల్సి ఉంటుందని కొందరు అర్థశాస్త్రవేత్తల అంచనా. మరి కొత్త ఉద్యోగాలు
భారీ సంఖ్యలో వచ్చేది సేవల రంగంలోనా? లేక తయారీ రంగంలోనా? అంటే– దీనిపై
ఏకాభిప్రాయం లేదు. ఆధునిక టెక్నాలజీ ఉపయోగంలోకి వస్తున్న ఇండియా సహా
ప్రపంచవ్యాప్తంగా సేవల రంగాలే అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని ఆయన
గుర్తుచేశారు. భారత దేశ జనాభాలో 26 కోట్ల మంది సంపన్నులు అత్యంత సంపన్న
అగ్రరాజ్యం అమెరికా జీవనశైలిని అనుసరించే ఆర్థిక సామర్ధ్యం సంపాదించారట. ఈ
లెక్కన భారత స్వాతంత్య్ర శత వార్షికోత్సవాలు జరిగే 2047 నాటికి ఇండియాకు
అనేకానేక అవకాశాలతోపాటు ఎదురయ్యే సవాళ్లను తట్టుకుని ముందుకు సాగడానికి
అవసరమైన సామర్ధ్యం సమకూర్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.