న్యూ ఢిల్లీ : ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు యథాతథ స్థితి
విధించింది. ఈ కేసు తదుపరి విచారణను జులై 31కి వాయిదా వేసింది. అప్పటివరకు
సీబీఐ ఎలాంటి దర్యాప్తూ కొనసాగించడానికి వీల్లేదని సోమవారం జస్టిస్
సంజీవ్‌ఖన్నా, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది.
ఈకేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను
సవాల్‌చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై గతనెల 27న
జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అరవింద్కుమార్లతోకూడిన ధర్మాసనం
విచారించింది. కానీ నాడు కోర్టు సమయం మించిపోవడంతో ఉత్తర్వులు వెలువరించకుండా
విచారణ వాయిదా వేసింది. హోలీసెలవుల తర్వాత ధర్మాసనం కూర్పు మారి.. సోమవారం
జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ సుందరేశ్‌ల ముందుకు ఈ కేసు వచ్చింది.
తొలుత రెండు అంశాలను తేల్చాల్సి ఉంది.
కేసు విచారణకు స్వీకరించిన వెంటనే జస్టిస్ సంజీవ్‌ఖన్నా మాట్లాడుతూ ‘‘ఇందులో
రెండు అంశాలు తేల్చాల్సి ఉంది. 1.ఈ కేసు ఇంట్రాకోర్ట్ అప్పీల్ (హైకోర్టులోనే
అప్పీల్‌కు వెళ్లడం) సమంజసమా? కాదా? 2. ఈ కేసులో మెరిట్స్ ఏమున్నాయి అనే
అంశాలను పరిశీలించాలి. అందుకు ఒకట్రెండు రోజుల సమయం పడుతుంది. నిర్ణయం
తీసుకున్న తర్వాత జులైలో వాదనలు వింటాం’’ అనిఅన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున
హాజరైన సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే స్పందిస్తూ తదుపరి విచారణవరకు ఉపశమనం
కల్పించాలన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందా? అని జస్టిస్
సంజీవ్‌ఖన్నా అడిగారు. ‘దర్యాప్తు ఆగిపోయింది. ఈకేసును సీబీఐ స్వాధీనం
చేసుకోలేదు’ అని దవే తెలిపి యథాతథస్థితి కొనసాగించాలన్నారు. అందుకుజస్టిస్
సంజీవ్‌ఖన్నా స్పందిస్తూ అదే పరిస్థితి కొనసాగనివ్వండన్నారు. ఈకేసులో
ప్రతివాది అయిన బీజేపీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ
జోక్యం చేసుకుంటూ‘నాకు తెలిసినంతవరకు సీబీఐ ఈకేసును విచారణకు తీసుకుంది’
అన్నారు. జస్టిస్ సంజీవ్‌ఖన్నా మాట్లాడుతూ ‘విషయం కోర్టులో ఉన్నందున (సీబీఐ)
దర్యాప్తు కొనసాగించొద్దు. ఆ విషయం స్పష్టంగా చెబుతున్నాం.
దస్త్రాలను సీబీఐకి అప్పగించలేదని పేర్కొనండి న్యాయవాది దవే వాదనలు వినిపిస్తూ
మాకు రక్షణ ఛత్రం (ప్రొటెక్షన్ అంబ్రెల్లా) కల్పించాలని కోరారు. జస్టిస్
సంజీవ్‌ఖన్నా, జస్టిస్ సుందరేశ్‌లు స్పందిస్తూ ‘ఏమీ జరగదులే’ అని బదులిస్తూ
తొలుత ఈకేసును జులై 17కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. యథాతథ స్థితి
కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని దుష్యంత్ దవే కోరారు. అందుకు జస్టిస్
సంజీవ్‌ఖన్నా స్పందిస్తూ ‘దస్త్రాలు మీదగ్గరే ఉన్నాయి. ఏమీ జరగదు’ అని
పేర్కొన్నారు. కేసు దస్త్రాలను సీబీఐకి అప్పగించలేదన్న తమ స్టేట్మెంట్ను
పొందుపరచాలనగా.. జస్టిస్ సంజీవ్‌ఖన్నా స్పందించి ‘ఇన్వెస్టిగేషన్‌కు
సంబంధించిన పేపర్లు, దస్తావేజులు సీబీఐకి అప్పగించలేదని పిటిషనర్
పేర్కొన్నారు’ అని ఉత్తర్వుల్లో పొందుపరిచారు. దవే మాట్లాడుతూ జులై
రెండోవారంలో తెలంగాణ తరఫున హాజరయ్యే సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా
కుమారుడి గ్రాడ్యుయేషన్ యూకేలో ఉన్నందున ఆరోజు హాజరుకావడం సాధ్యంకాదన్నారు.
న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్‌ఖన్నా విచారణను జులై 31కి వాయిదా వేశారు.