ఫిబ్రవరి 16న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా, నేడు మేఘాలయ, నాగాలాండ్
రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, ఈ
మూడు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. త్రిపురలో బీజేపీదే
విజయం అని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
బీజేపీ కూటమికి 36 నుంచి 45 స్థానాలు, లెఫ్ట్ కూటమికి 6 నుంచి 11 స్థానాలు
తిప్రా మోథా పార్టీకి 9 నుంచి 16 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ లో
పేర్కొన్నారు. ఇక, మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్ పీపీ) విజయభేరి
మోగిస్తుందని జీన్యూస్-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ వివరించాయి. ఎన్ పీపీకి 21
నుంచి 26 స్థానాలు, తృణమూల్ కాంగ్రెస్ కు 8 నుంచి 13 స్థానాలు, బీజేపీకి 6
నుంచి 11 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 3 నుంచి 6 స్థానాలు, ఇతరులకు 10 నుంచి
19 స్థానాలు వస్తాయని వెల్లడించారు. జీన్యూస్-మ్యాట్రిజ్ నాగాలాండ్ ఎగ్జిట్
పోల్స్ ను కూడా వెలువరించింది. నాగాలాండ్ లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి విజయం
సాధిస్తుందని అంచనా వేసింది. బీజేపీ-ఎన్డీపీపీ కూటమికి 35 నుంచి 43 స్థానాలు,
కాంగ్రెస్ పార్టీకి 1 నుంచి 3 స్థానాలు, ఎన్ పీఎఫ్ కు 2 నుంచి 5 స్థానాలు
వస్తాయని వివరించింది.