మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రెండు
రాష్ట్రాల్లోనూ కలిపి మొత్తం 34 లక్షలమంది ఓటర్లు ఎమ్మెల్యేలను
ఎన్నుకోనున్నారు. రెండింటికీ చెరో 60 సభ్యుల సామర్థ్యం ఉండగా ప్రస్తుత
ఎన్నికలు చెరో 59 సీట్లకు మాత్రమే జరగనుండటం గమనార్హం. నాగాలాండ్‌లోని అకులుటో
నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఖేకాషీ సుమీ బరిలో నుంచి తప్పుకోవడంతో
బీజేపీ అభ్యర్థి కజీటో కినిమి గెలుపు ఏకపక్షమైంది. ఇక మేఘాలయలో సోహియాంగ్
నియోజకవర్గంలో నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) అభ్యర్థి హెడీఆర్ లింగ్డో
మృతిచెందడంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి. మేఘాయలకు 1972లో తొలిసారి
ఎన్నికలు జరగగా అప్పటి నుంచి నేటి వరకూ ఎప్పుడూ ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ
రాలేదు. ఈసారి తాము 30 సీట్ల మార్కును దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ
అధికార ఎన్పీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా 56 సీట్లలో ఎన్పీపీ తమ
మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా అభ్యర్థుల్ని నిలపడం గమనార్హం.
మేఘాలయ ఎన్నికలు : మేఘాలయ రాష్ట్ర అసెంబ్లీలో 60 స్థానాలు ఉన్నాయి. అయితే
ప్రస్తుతం 59 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ నియోజకవర్గాల్లో పోటీ
చేస్తున్న 69 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని మొత్తం 21.6 లక్షల మంది ఓటర్లు
నిర్ణయించనున్నారు. సోహియాంగ్ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ
పోలింగ్ వాయిదా పడింది. గత ఐదేళ్లుగా అధికార కూటమికి నాయకత్వం వహిస్తున్న
అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ మాజీ మిత్రపక్షం బీజేపీ, ప్రతిపక్ష టీఎంసీ, ఇతర
ప్రాంతీయ పార్టీలపై ఒంటరిగా పోటీ చేస్తోంది. దక్షిణ తురా నియోజకవర్గం నుంచి
ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా మిలిటెంట్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన
బెర్నార్డ్ మరక్ పై పోటీ చేస్తున్నారు. విపక్ష నేత, టీఎంసీ నేత ముకుల్ సంగ్మా
సోంగ్‌సాక్, తిక్రికిల్లా అనే రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన
సతీమణి డీడీ శిరా, సోదరుడి భార్య కూడా ఎన్నికల రేసులో ఉన్నారు.
నాగాలాండ్ ఎన్నికలు : నాగాలాండ్ లో 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 13
లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అకులుటో నుంచి
బీజేపీ అభ్యర్థి కజెటో కినిమి ఏకగ్రీవంగా గెలిచారు. అధికార నేషనలిస్ట్
డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)తో కలిసి బీజేపీ 20 : 40
నిష్పత్తిలో సీట్ల సర్దుబాటుపై పోటీ చేస్తోంది. ఎన్డీపీపీ-బీజేపీ కూటమికి
ముఖ్యమంత్రి అభ్యర్థిగా నెఫియు రియో ఉన్నారు. 2003 వరకు రాష్ట్రంలో అధికారంలో
ఉన్న కాంగ్రెస్ 23 మంది అభ్యర్థులను నిలబెట్టగా నాగా పీపుల్స్ ఫ్రంట్
(ఎన్పీఎఫ్) 22 స్థానాల్లో పోటీ చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 26 స్థానాలు
గెలుచుకున్న ఎన్పీఎఫ్ 22 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా వారిలో ఒకరు
వైదొలగడంతో 21 మంది పోటీలో ఉన్నారు.