లోక్ సభ ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలి ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
ప్రియాంకా గాంధీ అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఐక్యతపై భారీగా అంచనాలు ఉన్నాయని
చెప్పారు. చత్తీస్ గఢ్ లో జరుగుతున్న కాంగ్రెస్ 85వ ప్లీనరీ సెషన్ లో ప్రియాంక
మాట్లాడారు. భావసారూప్యత గల ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా
ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల ఐక్యతపై ప్రతి ఒక్కరిలోనూ అంచనాలు
ఉన్నాయని, తమ పార్టీపైనే మరింత ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ
సందేశాన్ని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని
కార్యకర్తలకు సూచించారు. బీజేపీపై పోరాటం చేసే విషయంలో కార్యకర్తల్లో ధైర్యం
ఉందని, దేశం కోసం దాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మండల స్థాయి
నుంచి కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.