న్యూఢిల్లీ : కర్ణాటకలోని శివమొగ్గలో భారీ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి
సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోడీ నేడు శివమొగ్గ విమానాశ్రయాన్ని
ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.450 కోట్లతో శివమొగ్గ
విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. శివమొగ్గ విమానాశ్రయానికి కమలం ఆకారంలో
నిర్మించిన సరికొత్త టెర్మినల్ భవనం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. గంటకు 300
మంది ప్రయాణికులకు సేవలు అందించేలా ఈ టెర్మినల్ ను తీర్చిదిద్దారు. త్వరలో
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, బీజేపీ పెద్దలు తరచుగా
రాష్ట్రంలో పర్యటిస్తూ వివిధ అభివృద్ధి పనులు ప్రారంభిస్తుండడం ప్రాధాన్యత
సంతరించుకుంది. ఈ ఏడాది కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తుండడం ఇది
ఐదోసారి. నరేంద్ర మోడీ సోమవారం శివమొగ్గ ఎయిర్ పోర్టును ప్రారంభించడంతో పాటు
బెళగావిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.