సోనియా గాంధీ రిటైర్మెంట్ వార్తలపై వివరణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ ముగిస్తున్నట్టు సోనియా వ్యాఖ్యలు
సోనియా రాజకీయ ప్రస్థానం ముగిసిందంటూ కథనాలు
కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇక ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారంటూ వార్తలు వచ్చాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. చత్తీస్ గఢ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుమారి సెల్జా దీనిపై స్పందిస్తూ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం సంతోషంగా ఉందని మాత్రమే సోనియా గాంధీ చెప్పారని స్పష్టం చేశారు. అంతేతప్ప, రాజకీయాలకు దూరమవుతున్నట్టు ఆమె ఎక్కడా చెప్పలేదని వివరించారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలన్న ఉద్దేశం సోనియాకు లేదని తెలిపారు. ప్లీనరీలో సోనియా మాట్లాడుతూ భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ కు చరమగీతం పాడడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. దాంతో, ఇన్నింగ్స్ అంటే ఆమె రాజకీయ ప్రస్థానం అయ్యుంటుందని, పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతున్నట్టు పరోక్షంగా చెప్పారని కథనాలు వచ్చాయి.