జేడీఎస్ నేత కుమారస్వామి
శివమొగ్గ : జేడీఎస్‌ను కుటుంబ పార్టీ అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన
వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత కుమారస్వామి మండిపడ్డారు. తమపై విమర్శలు చేసేముందు..
భాజపా సీనియర్ నేత యడియూరప్ప కుటుంబాన్ని చూసి మాట్లాడాలని స్పష్టం చేశారు
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య
విమర్శలు, ఆరోపణలు జోరందుకుంటున్నాయి. బీజేపీ ముఖ్య నేతలు ఇప్పటికే
ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే జేడీఎస్ వంటి పార్టీలు కుటుంబ
పార్టీలంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. వీటిపై తాజాగా స్పందించిన కర్ణాటక మాజీ
ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి వారసత్వ రాజకీయాలపై వ్యాఖ్యలు
చేసేముందు మొదట బీజేపీ నేత యడియూరప్ప వైపు చూడాలని తిప్పికొట్టారు. బెంగళూరు
పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా జేడీఎస్ పార్టీ కుటుంబ పార్టీ అంటూ
వ్యాఖ్యానించారు. దేవేగౌడ కుటుంబాన్ని ప్రస్తావించిన ఆయన ‘ఆ కుటుంబంలో
ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎవరైనా ఉన్నారా.? అందరూ ఎన్నికల్లో పోటీ చేసి
రాష్ట్రాన్ని పాలించాలని కోరుకుంటున్నారు. అసలు వాళ్ల ఇంటిని ఎవరు
నడిపిస్తున్నారో అర్థం కావడం లేదని అమిత్ షా ఎద్దేవా చేశారు. దీనిపై
స్పందించిన హెచ్డీ కుమారస్వామి ‘మా కుటుంబ విషయాలపై ఆందోళన చెందుతున్నందుకు
ఆయన్ను మేం సత్కరించాలి. బీఎస్ యడియూరప్ప ఇద్దరు కుమారులు బీజేపీలో కీలక
స్థానాల్లో ఉన్నారు. మరి వారి కుటుంబ బాధ్యతలు ఎవరు చూస్తున్నారు. ఇదే
ప్రశ్నను ఓసారి యడియూరప్పను అడగాలి. ఆయనే (యడియూరప్ప) సమాధానం ఇస్తారేమో!’
అంటూ బదులిచ్చారు. యడియూరప్పను వెనక పెట్టుకొని అమిత్ షా ఇతరులకు పాఠాలు
చెబుతున్నారని మండిపడ్డారు. ఇక జేడీఎస్‌కు వేసే ప్రతి ఓటూ కాంగ్రెస్‌కు
వెళ్తుందని అమిత్ షా చెప్పడం పట్ల కుమారస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.