కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప ప్రకటన
ఆయన ప్రసంగం పార్టీ విలువలకు అద్దం : ప్రధాని ట్వీట్
బెంగళూరు : ప్రత్యక్ష రాజకీయాల నుంచి తాను విరమించుకుంటున్నానని, ఇకపై పార్టీ
వ్యవహారాలకే పరిమితమవుతానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత
యడియూరప్ప కీలక ప్రకటన చేశారు. బీజేపీ విజయమే తన లక్ష్యమని, కాంగ్రెస్ను
విపక్ష స్థానానికే పరిమితం చేస్తానని ప్రతిన పూనారు. కర్ణాటక అసెంబ్లీ
సమావేశాల చివరిరోజున ఆయన మాట్లాడుతూ తనకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు,
రాజకీయాల్లో ఎత్తుపల్లాలను అధిగమిస్తూ వచ్చిన విధానాన్ని వివరించారు. ‘నేను
ప్రత్యక్ష రాజకీయాల్లోంచి వైదొలగినా ఇంట్లో కూర్చునే ప్రశ్నే లేదు. నా
తుదిశ్వాస వరకు పార్టీ కోసం శ్రమిస్తా. నన్ను బీజేపీ నిర్లక్ష్యం చేసిందన్న
ఆరోపణలు అర్థరహితం. పార్టీ పెద్దలు, ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో గౌరవంగా
చూసుకుంటున్నారని ప్రకటించారు. యడియూరప్ప ప్రసంగాన్ని తన ట్విటర్లో ట్యాగ్
చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రసంగం పార్టీ విలువలకు అద్దం పట్టిందన్నారు.