ప్రభుత్వ ఉద్యోగులకు కేరళ ప్రభుత్వం షాకిచ్చింది. ఇకపై వారు ఎలాంటి యూట్యూబ్
చానళ్లు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు అలా చేయడం ప్రవర్తనా
నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందంటూ తాజాగా విడుదల చేసిన జీవోలో పేర్కొంది.
ఉద్యోగులు ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఉపయోగించేందుకు మాత్రమే వారి వ్యక్తిగత
స్వేచ్ఛ పరిమితమని, సబ్స్క్రైబర్లను కలిగి ఉండేందుకు, యూట్యూబ్ చానల్ ద్వారా
ఆర్థికంగా లబ్ధి పొందేందుకు దానిని ఉపయోగించకూడదని తేల్చి చెప్పింది.
ఒకవేళ అలా ఎవరైనా యూట్యూబ్ చానళ్లను నిర్వహిస్తే కేరళ ప్రభుత్వ ఉద్యోగుల
నియమావళి 1960 ప్రకారం ఉల్లంఘనే అవుతుందని తేల్చి చెప్పింది. ప్రస్తుత నియమ
నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు యూట్యూబ్ చానళ్లు ప్రారంభించేందుకు అనుమతి
ఇవ్వడం సాధ్యం కాదని ఆ జీవోలో పేర్కొంది. యూట్యూబ్ చానల్ నిర్వహణకు అనుమతి
కోరుతూ అగ్నిమాపక సిబ్బంది చేసిన విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆదేశాలు
జారీ చేసింది. అంతేకాదు, ఇప్పటికే యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తున్న ప్రభుత్వ
ఉద్యోగులు తమ చానళ్లను మూసివేయాలని ఆ జీవోలో కోరింది. కార్యాలయాలకు వచ్చిన
తర్వాత కూడా ఉద్యోగులు ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడుపుతుండడం వల్లే
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.