బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024
లోక్ సభ ఎన్నికల్లో విపక్షాలు కలసికట్టుగా పోరాడితే బీజేపీకి 100 సీట్లకు
మించి రావని అన్నారు. ఇప్పుడు పార్టీలన్నీ వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నాయని,
అన్ని పార్టీలు జట్టుకట్టేందుకు సరైన సమయం రావాలని అభిప్రాయపడ్డారు. 2024
ఎన్నికల దిశగా కాంగ్రెస్ సహా ప్రతి పార్టీ చేయి చేయి కలిపి పోరాడాల్సి ఉందని
పిలుపునిచ్చారు.
“దీనిపై మీరు (కాంగ్రెస్) త్వరగా నిర్ణయం తీసుకోవాలి. నా సలహా వింటే బీజేపీపై
పైచేయి సాధించవచ్చు. నా సలహా స్వీకరించకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు” అని
నితీశ్ వ్యాఖ్యానించారు. పాట్నాలో సీపీఐ (ఎం) 11వ వార్షిక సభలో మాట్లాడుతూ ఆయన
పైవ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాని పదవి చేపట్టాలన్న లక్ష్యాలేవీ లేవని, ఆ
పదవికి తాను రేసులో లేనని బీహార్ సీఎం స్పష్టం చేశారు. విద్వేషాలు రగిల్చే
వారి నుంచి దేశానికి విముక్తి కలిగించి, జాతిని ఐక్యంగా ఉంచడమే తన లక్ష్యమని
వెల్లడించారు.