కన్నా లక్ష్మీనారాయణపై జీవీఎల్ నరసింహారావు విమర్శలు
బీజేపీకి ఏపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన
సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఆయన తీవ్ర విమర్శలు
గుప్పించారు. ఈ నేపథ్యంలో కన్నాపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు
మండిపడ్డారు. కన్నా గురించి రాష్ట్ర పార్టీ నేతలతో తాను మాట్లాడానని చెప్పారు.
పార్టీలో కన్నాకు సముచిత గౌరవం ఇచ్చామని… జాతీయ కార్యవర్గంలో సైతం పార్టీ
అధిష్ఠానం చోటు కల్పించిందని చెప్పారు. తనపై కూడా కన్నా ఎన్నో విమర్శలు
చేశారని, వాటిపై తాను మాట్లాడబోనని తెలిపారు. సోము వీర్రాజుపై కన్నా విమర్శలు
గుప్పించారని… పార్టీలో సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయాలు పార్టీ
అధిష్ఠానానికి చెప్పి తీసుకున్నవేనని అన్నారు. ఏకపక్షంగా సోము వీర్రాజు ఎలాంటి
నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతానికి కన్నా గురించి ఇంతకన్నా
మాట్లాడేదేమీ లేదని అన్నారు.