తహతహలాడుతున్నాయి. జేడీయూ, ఎల్జేపీ, ఆర్జేడీ వంటి పార్టీలు ఈశాన్య
రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ సారి ఈశాన్య
రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. జాతీయ
పార్టీలుగా గుర్తింపు పొందాలన్న తపనే అందుకు కారణంగా తెలుస్తోంది.జేడీయూ, లోక్ జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ).. ఈ
పార్టీల పేర్లు వినగానే బిహార్ గుర్తుకొస్తుంది. వాటి అసలైన రాజకీయ
రణక్షేత్రం ఆ రాష్ట్రమే. బిహార్ నుంచి విడిపోయిన ఝార్ఖండ్‌లో వాటి ఉనికి
నామమాత్రం! అయితే ఝార్ఖండ్‌లో విస్తరణపై పెద్దగా దృష్టిపెట్టని ఈ పార్టీలు
ఈశాన్య రాష్ట్రాలపై పట్టు కోసం మాత్రం తహతహలాడుతున్నాయి. ఇప్పటికే జేడీయూ ఈ
విషయంలో కొంత సఫలీకృతమైంది కూడా. అదే బాటలో ఆర్జేడీ, ఎల్జేపీ (రాంవిలాస్)
సైతం ఈశాన్య రాష్ట్రాల్లో తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో దించుతున్నాయి. జాతీయ
పార్టీలుగా గుర్తింపు పొందాలన్న తపనే అందుకు ప్రధాన కారణం.
ఎన్పీపీ స్ఫూర్తి :
మేఘాలయలో ప్రస్తుతం నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధికారంలో ఉంది.
లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా 2013లో ఆ పార్టీని స్థాపించారు. అదే ఏడాది
డిసెంబరులో జరిగిన రాజస్థాన్ ఎన్నికల్లో ఎన్పీపీ నాలుగు శాసనసభ స్థానాలను
గెల్చుకుంది. 2016లో పీఏ సంగ్మా మరణంతో ఆయన కుమారుడు కాన్రాడ్ సంగ్మా పార్టీ
పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ఈశాన్యంలోని ప్రతి రాష్ట్ర ఎన్నికల్లో ఆ పార్టీ
పోటీ చేయడం ప్రారంభించింది. 2017లో మణిపుర్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి
నాలుగు స్థానాలు, అదే రాష్ట్రంలో 2022లో ఏడు సీట్లు దక్కించుకుంది. 2018లో
నాగాలాండ్‌లో రెండు, తర్వాతి ఏడాది అరుణాచల్ ప్రదేశ్‌లో ఐదు అసెంబ్లీ సీట్లలో
విజయం సాధించింది.
అదే బాటలో జేడీయూ..
ఎన్పీపీ బాటలో జేడీయూ సైతం ఈశాన్య రాష్ట్రాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది.
2018లో నాగాలాండ్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక స్థానంలో గెలుపొందింది. అదే
ఉత్సాహంతో 2019లో అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల బరిలోకి దిగి.. ఏడు స్థానాలతో
రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2022లో మణిపుర్ ఎన్నికల్లో
ఆరు స్థానాలు గెల్చుకుంది. బిహార్ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం ఉండటంతో
జేడీయూకు జాతీయ పార్టీ హోదా దక్కే అవకాశం లభించినా ఆ పార్టీ తరఫున
నాగాలాండ్‌లో గెలిచిన ఒకరు, అరుణాచల్‌లో విజయం సాధించిన ఏడుగురు ఇతర
పక్షాల్లోకి ఫిరాయించడంతో చుక్కెదురైంది.