అదానీ- హిండెన్‌బర్గ్ వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
చేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ భయపడాల్సిందేమీ స్పష్టం చేశారు. ఇందులో దాపరికాలు
లేవని అన్నారు. అయితే, అమిత్ షా ప్రకటనపై స్పందించిన కాంగ్రెస్ జేపీసీ
ఏర్పాటుకు ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించింది.
అదానీ గ్రూప్- హిండెన్‌బర్గ్ వివాదంపై బీజేపీ కి ఎలాంటి భయాలు లేవని కేంద్ర
హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇందులో బీజేపీ దాచిపెట్టడానికి ఏమీ లేదని
అన్నారు. ఈ అంశంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో మాట్లాడిన ఆయన
ఈ విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున తాను పెద్దగా మాట్లాడనని చెప్పారు.
అదానీ గ్రూప్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన ప్రసంగంపై
అమిత్ షా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ హయాంలో రూ.12లక్షల కోట్ల కుంభకోణాలు
జరిగాయని ఆరోపించారు.
“మా హయాంలో ఆశ్రిత పక్షపాతం అనే ప్రశ్నే లేదు. మాపై అలాంటి ఆరోపణలు ఎవరూ
చేయలేరు. కాంగ్రెస్ పాలనలో కాగ్, సీబీఐ వంటి ఏజెన్సీలు స్వయంగా అవినీతిపై
కేసులు నమోదు చేశాయి. అప్పుడు రూ.12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి. రాహుల్
గాంధీ లోక్‌సభలో ఏం మాట్లాడతారనేది ఆయన ఇష్టం. సుప్రీంకోర్టు ఈ (అదానీ
వ్యవహారం) విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న
విషయంపై ఓ మంత్రిగా మాట్లాడలేను. కానీ బీజేపీ ఈ విషయంలో దాచడానికి, భయపడటానికి
ఏమీ లేదనీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
కోర్టులపై మా ప్రభావం లేదు
దేశంలోని వ్యవస్థలన్నింటినీ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నారని విపక్షాలు
ఆరోపించడాన్ని అమిత్ షా ఖండించారు. కోర్టులపై బీజేపీ ప్రభావం ఏమీ లేదని
స్పష్టం చేశారు. ‘వారు (విపక్షాలు) కోర్టుకు ఎందుకు వెళ్లవు? పెగాసస్ వివాదం
సమయంలోనూ నేను ఇదే చెప్పా. ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లాలని సూచించా. కానీ
సమస్యపై అనవసర రాద్ధాంతం చేయడమే వారికి తెలుసు. కోర్టుకు వెళ్లిన వారికి
న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చిందని అన్నారు.
గుజరాత్ అల్లర్లను ప్రస్తావిస్తూ మోడీ పై బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేయడంపై
స్పందించిన అమిత్ షా ఇలాంటివి మోడీకి కొత్త కాదని అన్నారు. ప్రధాని నరేంద్ర
మోడీ పై 2002 నుంచి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘ప్రధాని మోడీ పై 2002
నుంచి కుట్రలు జరుగుతున్నాయి. కానీ నిజం ఎప్పటికీ సూర్యుడిలా వెలుగుతుంది.
వెయ్యి కుట్రలు పన్నినా నిజాన్ని దెబ్బతీయలేరు. తనపై ఎన్ని కుట్రలు పన్నినా
నరేంద్ర మోడీ ఎప్పటికప్పుడు మరింత బలమైన నేతగా ఎదిగారు. ప్రజల్లో మరింత
పాపులారిటీ సంపాదించుకున్నారు’ అని అమిత్ షా పేర్కొన్నారు.