ఢిల్లీ, ముంబయిలో ఉన్న బీబీసీ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు ‘దాడులు’
నిర్వహించారు. అయితే ఈ సోదాలపై ఐటీ అధికారులు వివరణ ఇచ్చారు. సర్వే మాత్రమే
చేస్తున్నామని, సోదాలు చేయట్లేదని తెలిపారు.
ఢిల్లీ, ముంబయిలో ఉన్న బీబీసీ కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు ‘దాడులు’
నిర్వహించారు. మోడీ డాక్యుమెంటరీ వివాదం నేపథ్యంలో ఈ ‘దాడులు’ జరిగాయి. ఐటీ
శాఖ డైరెక్టర్ జనరల్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సోదాలపై ఐటీ
అధికారులు వివరణ ఇచ్చారు. సర్వే మాత్రమే చేస్తున్నామని, సోదాలు చేయట్లేదని
తెలిపారు. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ నిబంధనలు, లాభాల మళ్లింపు వంటి అంశాలపై
దర్యాప్తు చేస్తున్నట్లు ఐటీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. కొన్ని వారాల
క్రితమే నరేంద్ర మోడీ పై “ఇండియా.. ద మోడీ క్వశ్చన్” పేరిట బీబీసీ ఒక
డాక్యుమెంటరీని విడదల చేసింది. రెండు భాగాలుగా దీన్ని రూపొందించింది. 2002లో
మోడీ సీఎంగా ఉన్న సమయంలో గుజరాత్ జరిగిన అల్లర్ల గురించి చెప్పడమే ఈ
డాక్యుమెంటరీని ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలోనే ఆదాయ పన్ను శాఖ అధికారులు
బీబీసీపై దాడులు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ దాడుల్లో కొన్ని
ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొబైల్స్
ఫోన్స్, లాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్ జప్తు చేసినట్లు వెల్లడించారు.
‘ఉదయం 11 గంటలకు ఢిల్లీ, ముంబయిలోని కార్యాలయాల్లోకి ఐటీ అధికారులు
చేరుకున్నారు. వెంటనే బీబీసీ ఉద్యోగుల ఫోన్లను కార్యాలయంలోనే ఓ చోట
ఉంచాల్సిందిగా ఆదేశించారు. లండన్ హెడ్ ఆఫీస్‌తో పాటు భారత్‌లోని కార్యాలయం
బిజినెస్ ఆపరేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్ల కోసం అధికారులు వెతుకుతున్నారు.
బీబీసీ అనుబంధ కంపెనీలకు సంబంధించిన ట్యాక్స్ వివరాలపై దర్యాప్తు
చేస్తున్నారు. ఇది పూర్తిగా బీబీసీ బిజినెస్ ఆపరేషన్లకు సంబంధించినదే. సంస్థ
ప్రమోటర్లు, డైరెక్టర్ల నివాసాలపై ఐటీ సోదాలు జరగడం లేదు’ అని సంబంధిత వర్గాలు
తెలిపాయి. ఢిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ సర్వేకు పూర్తిస్థాయిలో
సహకరిస్తున్నట్టు బీబీసీ తెలిపింది. వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం
లభిస్తుందని ఆశిస్తున్నట్లు బీబీసీ ప్రెస్ కార్యాలయం ట్వీట్ చేసింది. మరోవైపు
బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సర్వేపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యవహారాన్ని
క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
మరోవైపు, ఈ సోదాలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. తాము అదానీ సమస్యపై జేపీసీ
దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తూ ఉంటే అధికార పార్టీ మాత్రం బీబీసీ వెంట
పడుతోందని ధ్వజమెత్తింది. ప్రభుత్వ తీరు వినాశకాలే విపరీత బుద్ధి అనే సామెతను
గుర్తు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మండిపడ్డారు.