మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలింపు
తిరువనంతపురం : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి
ఊమెన్ చాందీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజులుగా న్యుమోనియాతో
సతమతమవుతున్న ఆయనను కుటుంబసభ్యులు నెయ్యట్టింకర సమీపంలోని ఓ ప్రైవేట్
ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం
చక్కబడుతున్నట్లు కనిపించకపోవడంతో మెరుగైన చికిత్స కోసం కర్ణాటక రాజధాని
బెంగళూరుకు తరలించారు.
ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆయనను బెంగళూరుకు షిఫ్ట్ చేశారు. ఈ సందర్భంగా
ఊమెన్ చాందీ వెంట ఆయన సతీమణి, కొడుకు, ఇద్దరు కుమార్తెలు, బెంగళూరుకు చెందిన
సీనియర్ కాంగ్రెస్ నేత ఉన్నారు. నెయ్యట్టింకర ఆస్పత్రి నుంచి వీల్ చైర్లో
బయటికి వచ్చిన చాందీ తన ట్రీట్మెంట్ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని
తీసిపుచ్చారు. ఊమెన్ చాందీ కుటుంబసభ్యులు కొందరు ఆయనకు సరైన చికిత్స
అందనివ్వడంలేదని ఆయన బంధువులే ఆరోపించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దాంతో ఆయన
ఆ వార్తలు అబద్ధమని చెప్పారు. కాగా, 2019 నుంచి ఊమెన్ చాందీ ఆరోగ్యం సరిగా
ఉండటంలేదు. కొన్ని నెలల క్రితం గొంతు సంబంధ అనారోగ్యంతో ఆయన జర్మనీలో చికిత్స
తీసుకుని వచ్చారు.