న్యూఢిల్లీ : రైలు ప్రయాణీకులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు దేశంలోని
అన్ని రైళ్ళు, రైల్వే స్టేషన్లలో అత్యవసర మందులు, మెడికల్ సామాగ్రి, ఆక్సిజన్
సిలిండర్ కలిగిన మెడికల్ బాక్స్‌లను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి
అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్సీపీ సభ్యులు
వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అత్యవసర పరిస్థితులలో
ప్రయాణీకులకు ఫస్ట్ ఎయిడ్ సేవలు చేసేలా ఫ్రంట్ లైన్ సిబ్బంది అయిన ట్రైన్
టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ), ట్రైన్ గార్డులు, సూపరింటెండ్లు, స్టేషన్
మాస్టర్లకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. రైళ్ళు, రైల్వే స్టేషన్లలో అత్యవసర
వైద్య సేవలు కల్పించే అంశాన్ని పరిశీలించాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలకు
అణుగుణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులతో ఒక నిపుణుల సంఘాన్ని ఏర్పాటు
చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అన్ని ప్రయాణీకుల రైళ్ళతోపాటు రైల్వే
స్టేషన్లలో అత్యవసర మందులతో కూడిన మెడికల్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని,
రైల్వే సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్ సేవలు అందించడంలో శిక్షణ ఇవ్వాలని, రైలు
ప్రయాణీకులలో ఎవరైనా డాక్టర్ అందుబాటులో ఉంటే వారి చేత లేదా సమీప రైల్వే
స్టేషన్లో అస్వస్థతకు గురైన ప్రయాణికునికి తక్షణ వైద్య సేవలు అందే సదుపాయం
కల్పించాలని నిపుణుల సంఘం సిఫార్సు చేసినట్లు మంత్రి తెలిపారు. ఫస్ట్ ఎయిడ్
సేవలు అందించే రైల్వే సిబ్బందికి ఎప్పటికప్పుడు రిఫ్రెషర్ కోర్సులు
నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే రైల్వే స్టేషన్‌కు సమీపాన ఉన్న
ఆస్పత్రులు, అక్కడ పని చేసే వైద్యుల, వారి మొబైల్ నంబర్లతో కూడిన జాబితాను
రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అస్వస్థతకు గురైన లేదా
గాయపడిన ప్రయాణికుడిని ఆస్పత్రికి తరలించేందుకు రైల్వే, రాష్ట్ర, కేంద్ర
ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రుల అంబులెన్స్ సర్వీసులను కూడా అందుబాటులో
ఉంచినట్లు మంత్రి పేర్కొన్నారు.
బీఐఎస్ ఆమోదం లేని బొమ్మల తయారీపై చర్యలు
వినియోగదారుల వ్యవహారాల సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి
న్యూఢిల్లీ : బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ఆమోదం లేకుండా
బొమ్మలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు శుక్రవారం రాజ్యసభలో
వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు వినియోగదారుల
వ్యవహారాల సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి చెప్పారు. ప్రభుత్వం స్వాధీనం
చేసుకుంటున్న బీఐఎస్ మార్క్ లేని బొమ్మలు పిల్లల ఆరోగ్యానికి ఎలాంటి చేటు
కలిగిస్తున్నవో ప్రభుత్వం మదింపు చేస్తోందా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ
బీఐఎస్ ఆమోదం లేకుండా బొమ్మలు తయారు చేస్తున్న వారిపై తరచుగా దాడులు
నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తున్నట్లు మంత్రి తెలిపారు.