ఈ నెల 16న త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ ఛీప్ నడ్డా
ఆదివాసీలకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని హామీ
త్రిపుర అసెంబ్లీకి ఈ నెల 16న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార బీజేపీ
ఉచితాల వర్షం కురిపించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిన్న
విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రజలపై హామీల జడివాన కురిపించారు. రాష్ట్రంలో తమకు
మళ్లీ పగ్గాలు అప్పగిస్తే ఆదివాసీలకు మరింత స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని
హామీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఆదివాసీలకు చట్టపరమైన, పాలన, ఆర్థిక
అధికారాలు అప్పగిస్తామని నడ్డా పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో
ఆడపిల్లలు పుడితే బాలికా సమృద్ధి యోజన కింద రూ. 50 వేల బాండ్ ఇస్తామని,
ప్రతిభావంతులైన కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు, రెండు ఎల్పీజీ సిలిండర్లు
ఉచితంగా అందిస్తామన్నారు. పీఎం కిసాన్ కింద ప్రస్తుతం అందిస్తున్న రూ. 6 వేల
సాయాన్ని రూ. 8 వేలకు పెంచుతామని, మహారాజా విక్రమ్ మాణిక్య పేరిట ఆదివాసీ
విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని నడ్డా హామీ ఇచ్చారు.