న్యూఢిల్లీ : కొన్ని రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాల కోసం భారీగా అప్పులు చేయటంపై
ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశాలను చూసిన తర్వాతైనా
అప్రమత్తం కావాలని హితవు పలికారు. లేకుంటే ఆయా రాష్ట్రాలతోపాటు దేశం కూడా
నాశనం అవుతుందని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి
సమాధానంలో హెచ్చరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేసిన నరేంద్ర
మోడీ ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసి 50 ప్రభుత్వాలను కూలగొట్టారని
మండిపడ్డారు. 9 ఏళ్ల ఎన్డీఏ హయంలో వివక్ష లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమ
ఫలాలు అందేలా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మోడీ చెప్పారు. ప్రధాని ప్రసంగం
సందర్భంగా అధికార-ప్రతిపక్ష సభ్యుల పోటాపోటీ నినాదాలతో రాజ్యసభ దద్దరిల్లింది.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో సమాధానం
ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ 60ఏళ్ల కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. దేశం
ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కాంగ్రెస్ ఎప్పుడూ
ప్రయత్నించలేదని, కేవలం కొందరితోనే సరిపెట్టేదని విమర్శించారు. దేశాభివృద్ధికి
అడ్డంకులు సృష్టిస్తూ 6దశాబ్దాలు వృథా చేయగా అదే సమయంలో చిన్నచిన్న దేశాలు
అభివృద్ధిపథంలో దూసుకెళ్లాయని చురకలు అంటించారు. తమ ప్రభుత్వం మాత్రం దేశం
ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనేలా విధానాల రూపకల్పనలో
నిమగ్నమైందని తెలిపారు.
అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటు కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష
పార్టీల ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తుండగానే ప్రధాని నరేంద్ర
మోడీ ప్రసంగం కొనసాగించారు. కొందరు సభ్యుల భాష, వ్యవహారశైలి నిరాశ చెందేలా
ఉందని, అలాంటివారి చర్యల వల్ల బీజేపీ మరింత వికసిస్తుందన్నారు. కొన్ని
రాష్ట్రాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ తర్వాత
తరాలను అప్పుల ఊబిలోకి నెట్టుతున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పుడు దేశంలో ఆర్థిక విధానాల గురించి పట్టింపులేదు. 24గంటలూ రాజకీయాలు తప్ప
మరొకటి ఆలోచించరు. వారు అర్థనీతి నుంచి అనర్థ నీతిగా మార్చారు. వారికి నేను
హెచ్చరిక చేస్తున్నాను. తప్పుడు దారుల్లో వెళ్లవద్దు. ఎందుకంటే మన
పొరుగుదేశాలను చూస్తున్నాం. అడ్డగోలుగా అప్పులు చేసి దేశాలను ముంచారు. ఇప్పుడు
మనదేశంలోనూ తాత్కాలిక ప్రయోజనాల కోసం చూస్తే వచ్చేతరం ఆ బాధలు అనుభవిస్తుంది.
మనమైతే అప్పులు చేద్దాం. తర్వాత వచ్చేవారు చూసుకుంటారు అన్నట్లుగా కొన్ని
రాష్ట్రాలు ప్రవర్తిస్తున్నాయి. అది వారితోపాటు దేశాన్నీ నాశనం చేస్తుంది. దేశ
ఆర్థిక ప్రయోజనాలు, రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితి విషయంలో క్రమశిక్షణ
మార్గాన్ని ఎంచుకోవాల్సిందే. రెండుపూటల రోటి కోసం కన్న కలను మీరు
పరిష్కరించలేదు. కానీ మేం పరిష్కరించాం. ఎవరికి సామాజిక న్యాయం ఆకాంక్ష ఉండేదో
దాన్ని మీరు పరిష్కరించలేదు. కానీ మేం పరిష్కరించి చూపాం. ఇది దేశం చూస్తోంది.