అదానీని మోదీ కాపాడుతున్నారన్న రాహుల్
అదానీ గురించి తాను అడిగిన ప్రశ్నలకు సమాధానాలే లేవని ఎద్దేవా
ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమన్న రాహుల్
న్యూ ఢిల్లీ : ప్రముఖ వ్యాపారవేత్త అదానీ అంశంపై పార్లమెంటు అట్టుడుకుతోంది.
అదానీ గ్రూప్ పై తాను లేవనెత్తిన పలు ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క
సమాధానం కూడా చెప్పలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగానికి
ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్ సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా
విపక్షాలపై ఆయన నిప్పులు చెరిగారు. ఆ తర్వాత పార్లమెంట్ ఆవరణలో మీడియాతో
రాహుల్ మాట్లాడుతూ తన ప్రశ్నలకు మోడీ ప్రసంగంలో సమాధానం లభించలేదని అన్నారు.
అదానీ గురించి సభలో తాను అడిగిన ప్రశ్నలకు నరేంద్ర మోడీ నుంచి సమాధానాలే
రాలేదని ఎద్దేవా చేశారు. అదానీ గ్రూప్ పై వెల్లువెత్తుతున్న ఆరోపణలపై
దర్యాప్తు చేస్తామని కూడా ప్రధాని చెప్పలేదని అన్నారు. అదానీని మోడీ
కాపాడుతున్నారని, అందుకే దర్యాప్తుపై మాట్లాడటం లేదని చెప్పారు. అదానీని మోడీ
రక్షిస్తున్నారనే విషయం తేలిపోయిందని అన్నారు. ఈ అంశం జాతీయ భద్రతకు
సంబంధించినదని, దీనిపై మోడీ విచారణ జరిపించాల్సిందేనని డిమాండ్ చేశారు.