న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాడుతూనే ఉంటామని
వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్లో
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం రాజ్యసభలో
జరిగిన చర్చలో మాట్లాడుతూ ప్రత్యేక హోదా హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్
పార్టీ, బీజేపీ ఉమ్మడిగా విఫలమయ్యాయని అన్నారు. 2014లో లోక్‌సభలో తలుపులు
మూసేసి విభజన బిల్లుకు ఆమోదముద్ర వేశారు. ఈ బిల్లుపై రాజ్యసభలో చర్చ
జరిగినపుడు ఆంధ్రప్రదేశ్‌కు అయిదేళ్ళపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని నాటి
ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ హామీ ఇస్తే ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య
నాయుడు హోదా అయిదేళ్ళు కాదు పదేళ్ళు ఇవ్వాలని పట్టుబట్టిన విషయాన్ని ఈ
సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
మూడు రాజధానుల ప్రణాళిక
వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి కావాలన్న
లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్నంగా తీసుకువచ్చిన మూడు రాజధానుల
ప్రణాళిక సర్వదా జనామోదం పొందిందని విజయ సాయి రెడ్డి అన్నారు. దురదృష్టవశాత్తు
న్యాయ వ్యవస్థ తీసుకున్న నిర్ణయం కారణంగా వికేంద్రీకరణ ఫలాలు రాష్ట్ర ప్రజలకు
అందలేదు. లోక్ సభలో 2020 ఫిబ్రవరి 4న హోం శాఖ మంత్రి ఒక ప్రశ్నకు ఇచ్చిన జవాబు ప్రకారం ఒక రాష్ట్ర
పరిధిలో రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే అని
స్పష్టం చేసింది. అంటే మూడు రాజధానుల ప్రణాళికకు కేంద్రం కూడా ఆమోదం
తెలిపిందని విజయసాయి రెడ్డి అన్నారు.
- విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలపాలని ప్రభుత్వాన్ని కోరారు.
- బీసీలకు జనాభా ప్రాతిపదికపై రిజర్వేషన్లు రిజర్వేషన్లు కల్పించడానికిచర్యలు తీసుకోవాలి.
- రాష్ట్రపతి ప్రసంగంలో సుమారు 20 సార్లు మహిళల గురించి చేసిన ప్రస్తావనను విజయసాయి రెడ్డి గుర్తు చేస్తూ నారీ శక్తి, మహిళా సాధికారత గురించి రాష్ట్రపతి ప్రసంగంలో నొక్కి చెప్పినా మహిళల భద్రత గురించి ప్రస్తావన లేకపోవడం శోచనీయమని అన్నారు.
- ప్రసంగం ప్రారంభంలో రాష్ట్రపతి ప్రసంగానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తరపున ఆయన ధన్యవాదాలు తెలియచేశారు.