న్యూఢిల్లీ : నిర్దుష్ట ప్రయోజనాల కోసం కేంద్రం వసూలు చేసే సెస్సులు, పన్నులపై
విధించే సర్‌చార్జీలు ఇతర సుంకాలలో రాష్ట్రాలకు వాటా ఉండబోదని ఆర్థిక మంత్రి
నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు
వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె జవాబిస్తూ సెస్సులు, సర్‌చార్జీలు ఇతర
సుంకాల పేరిట వసూలు చేసే మొత్తాలను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే
వినియోగిస్తుందని తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక
సంవత్సరం వరకు సెస్సుల రూపంలో కేంద్రం వసూలు చేసిన మొత్తాలను పట్టిక రూపంలో
మంత్రి వివరించారు. 2014-15లో సెస్సుల కింద కేంద్రం వసూలు చేసిన మొత్తం 82,914
కోట్లు. అదే 2021-22 ఆర్థిక సంవత్సరానికి సెస్సుల రూపంలో వసూలైన మొత్తం 3
లక్షల 52 వేల 728 కోట్ల రూపాయలు ఉన్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. కేంద్రం
వసూలు చేసే పన్నుల్లో రాష్ట్రాలకు చెందాల్సిన వాటాపై 15వ ఆర్థిక సంఘం సిఫార్సు
చేసిన ఫార్ములా వివరాల గురించి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ కేంద్రం
వసూలు చేసే పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘం
సిఫార్సు చేసింది. 2020-21 నుంచి 2025-26 వరకు అమలులో ఉండే 15వ ఆర్థిక సంఘం
అవార్డు రాష్ట్రాలకు పన్నుల వాటా పంపిణీ కోసం కొన్ని ప్రాతిపదికలను
సూచించింది. రాష్ట్ర జనాభా సంఖ్యకు 15 శాతం, భౌగోళిక విస్తీర్ణానికి 15 శాతం,
అటవీ, పర్యావరణానికి 10 శాతం, ఆదాయ వనరులకు 45 శాతం చొప్పున వెయిటేజి
ఇచ్చింది. వీటి ప్రాతిపదికపైనే కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాను
నిర్ణయించాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసినట్లు మంత్రి వివరించారు. ఈ
ప్రాతిపదిక ప్రకారం పన్నుల పంపిణీలో బీహార్‌కు 10 శాతం, ఉత్తర ప్రదేశ్‌కు 17
శాతం, మధ్య ప్రదేశ్‌కు 7 శాతం చొప్పున పొందగా ఆంధ్రప్రదేశ్ 4 శాతంకు మాత్రమే
పరిమితమైంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి కేంద్ర పన్నుల పంపిణీలో
ఆంధ్రప్రదేశ్‌కు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 24,460 కోట్లు, 2021-22లో 35,385
కోట్లు 2022-23లో సవరించిన అంచనాల మేరకు 38.176 కోట్లు లభించాయని మంత్రి
వెల్లడించారు. అలాగే 2023-24 బడ్జెట్ అంచనాల మేరకు కేంద్ర పన్నులలో
ఆంధ్రప్రదేశ్ వాటా కింద 41,338 కోట్ల రూపాయలు పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు.