అదానీ వ్యవహారంపై కేంద్రం, ఆర్బీఐ
హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల పతనం కొనసాగుతున్న వేళ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. నియంత్రణ, నిబంధనల
విషయంలో దేశీయ ఫైనాన్షియల్ మార్కెట్లు చాలా పటిష్ఠంగా ఉన్నాయని చెప్పారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
అదానీ షేర్ల వ్యవహారంతో బ్యాకింగ్ వ్యవస్థపై మీడియాలో వచ్చిన వార్తలపై రిజర్వ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం వేర్వేరుగా స్పందించాయి. దేశ
బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా
సీతారామన్ ధీమా నిర్మలా సీతారామన్ ధీమా వ్యక్తం చేశారు. తమ మొత్తం
పెట్టుబడుల్లో అదానీ కంపెనీల్లో ఉన్నవి చాలా తక్కువేనని ఎల్ఐసీ, ఎస్బీఐ
చేసిన వ్యాఖ్యల్ని ఆమె ప్రస్తావించారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులు
తగ్గుతున్నాయన్నారు.
అదానీ షేర్ల పతనం బ్యాంకింగ్ రంగంపై ఉండబోదని పరోక్షంగా ప్రస్తావించారు.
విదేశీ మదుపర్లు గతంలో మాదిరిగానే నిశ్చింతగా భారత్‌లో పెట్టుబడులు
కొనసాగించొచ్చని ఆమె తెలిపారు. నియంత్రణ, నిబంధనల విషయంలో దేశీయ ఫైనాన్షియల్
మార్కెట్లు చాలా పటిష్ఠంగా ఉన్నాయని చెప్పారు. ఒక్క ఉదంతాన్ని ఆధారంగా
చేసుకొని భారత మార్కెట్లను అంచనా వేయడం సరికాదని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా
అనేక అంశాల నుంచి భారత మార్కెట్లు పాఠాలు నేర్చుకున్నాయని పేర్కొన్నారు. దేశీయ
మార్కెట్లను పటిష్ఠంగా ఉంచడంలో నియంత్రణ సంస్థలు నిక్కచ్చిగా
పనిచేస్తున్నాయని చెప్పారు.
అదానీ గ్రూప్ రుణాలు, ఈక్విటీల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు(ఎల్ఐసీ)
రూ.36,474 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని.. ఇవి తమ మొత్తం పెట్టుబడుల్లో ఒక శాతం
కంటే తక్కువేనని ఎల్ఐసీ వెల్లడించింది. మరోవైపు.. ఎస్బీఐ ఇచ్చిన మెుత్తం
అప్పుల్లో అదానీ గ్రూప్‌నకు ఇచ్చింది 0.88 శాతం మాత్రమేనని ఎస్బీఐ ఛైర్మన్
దినేశ్ ఖేరా వెల్లడించారు. ఇది 27 వేల కోట్ల రూపాయలకు సమానమని పేర్కొన్నారు.
అదానీ గ్రూప్ షేర్లపై ఎస్బీఐ ఎలాంటి రుణాలు ఇవ్వలేదని దినేశ్ ఖేరా స్పష్టం
చేశారు. అదానీ గ్రూప్‌నకు ఉన్న ఆస్తులు, నగదు ప్రవాహాలను చూసిన తర్వాతే
అప్పులు ఇచ్చామన్నారు. రుణాలు తిరిగి చెల్లించడంలో అదానీ సంస్థకు మంచి
రికార్డు ఉందని పేర్కొన్నారు. మళ్లీ రుణాలు ఇవ్వాలని అదానీ గ్రూప్ నుంచి
ఎలాంటి అభ్యర్థన రాలేదని స్పష్టం చేశారు. తమ బ్యాంకు అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన
రుణాలేవీ తక్షణం సవాలుగా మారే సమస్యే లేదని ఎస్బీఐ ఛైర్మన్ దినేశ్ కుమార్
ఖేరా పేర్కొన్నారు.