టెక్ కంపెనీలన్నీ ఎడాపెడా ఉద్యోగులను ఇంటికి పంపేస్తున్న వేళ ‘చిప్’ రారాజు
ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను తొలగించడానికి బదులుగా వారి
వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. కంపెనీ సీఈవో స్థాయి నుంచి కింది
స్థాయి ఉద్యోగుల వరకు ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. ఆర్థిక మాంద్యం
నేపథ్యంలో కంపెనీలన్నీ వరుసగా ఉద్యోగులను తొలగిస్తుండగా ఇంటెల్ భిన్నంగా
ఆలోచించడాన్ని నిపుణులు కొనియాడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వేతనం కొంత
తగ్గినా పర్వాలేదు కానీ ఉన్నపళంగా ఉద్యోగం పోతే కష్టమేనని అంటున్నారు. ఈ
నేపథ్యంలో ఇంటెల్ నిర్ణయాన్ని ఆహ్వానించాల్సిందేనని చెబుతున్నారు. కాగా
ఇంటెల్ తాజా నిర్ణయంతో ఆ సంస్థ సీఈవో పాట్ గెల్సింగర్ వేతనంలో 25 శాతం,
ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు 15 శాతం, సీనియర్ మేనేజర్లకు 10 శాతం,
మధ్యస్థాయి మేనేజర్లకు 5 శాతం కోత విధిస్తారు. కంపెనీపై పెరిగిపోతున్న ఆర్థిక
పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటెల్ తెలిపింది.
సంస్థ భవిష్యత్తుకు ఇది దోహదం చేస్తుందని భావిస్తున్నట్టు పేర్కొంది.