గుజరాత్లో ఘనవిజయాన్ని సొంతం చేసుకున్న బీజేపీ హిమాచల్ అసెంబ్లీ, ఢిల్లీ
నగరపాలికల్లో అధికారం నిలబెట్టుకోలేకపోయింది. పదిహేనేళ్లుగా అధికారంలో
కొనసాగిన దిల్లీ నగరపాలక సంస్థలో వ్యతిరేకతను తట్టుకుని వందకుపైగా సీట్లు
సాధించడం విశేషమే. ఈ ఏడాది ఏకంగా తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను
ఎదుర్కోవాల్సి ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట జరిగే ఈ కీలక ఎన్నికల్లో
హోరాహోరీ పోరు సాగనుంది. ఈఏడాది మొదటి భాగంలో కొన్ని, రెండో భాగంలో మరికొన్ని
రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ,
కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల
అసెంబ్లీలకు విడతల వారీగా ఎన్నికలు జరగనున్నాయి. జూన్‌లోపు జరిగే కర్ణాటక
ఎన్నికలతో కీలక రాష్ట్రంలో ప్రజల ఆలోచనా సరళి ఎలా ఉందో తెలియనుంది.
దక్షిణాదిలో గట్టి ప్రాబల్యం కలిగిన ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని
నిలబెట్టుకుంటుందా అనేది ఆసక్తికరమే. కమలనాథులు ప్రధాని నరేంద్ర మోడీ పైనే
గట్టి ఆశలు పెట్టుకున్నారు. పార్టీలోని వర్గాలను ఒక్కతాటిపైకి తీసుకురాలేక
ముఖ్యమంత్రి బొమ్మై సతమతమవుతున్నారు. మాజీ సీఎం యడియూరప్ప మౌనముద్ర
అధినాయకత్వాన్ని ఆందోళన పరుస్తోంది. కర్ణాటక కాంగ్రెస్‌లోనూ అంతర్గత
పరిస్థితులేమీ పూర్తిస్థాయిలో ప్రశాంతంగా లేవనే చెప్పాలి. రేపటి ఎన్నికల్లో
బీజేపీ ని అధికారం నుంచి గద్దె దించినా పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌కు
ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య సుముఖత
వ్యక్తం చేస్తారా అనేది తెలియడం లేదు. మరోవైపు కాంగ్రెస్ విజయావకాశాలను
జేడీఎస్ దెబ్బతీస్తుందని బీజేపీ విశ్వసిస్తోంది. ఇప్పటికే ఎన్నికలను దృష్టిలో
పెట్టుకొని బొమ్మై సర్కారు విద్య, ఉద్యోగాల్లో ఇతర సామాజిక వర్గాలకు
రిజర్వేషన్లు కల్పించే దిశగా పావులు కదుపుతోంది.
అంతర్గత సమస్యలు
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో పరిస్థితులు కొంతమేర సౌకర్యవంతంగానే ఉన్నట్లు
భాజపా భావిస్తోంది. వర్గపోరుతో అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకోలేక
విఫలమవుతున్న పరిస్థితిలో కాంగ్రెస్ ఉండటంతో బీజేపీ గెలుపుపై ఆశలు
పెట్టుకుంది. కాంగ్రెస్‌కు కమల్‌నాథ్, దిగ్విజయ్‌సింగ్ వంటి హేమాహేమీలు
ఉన్నా వారు జట్టుగా పనిచేస్తున్న పరిస్థితులు కనిపించడం లేదు. అంతర్గత సమస్యలు
మరీ ఎక్కువ స్థాయిలో లేకపోవడం కమలం పార్టీకి కలిసి వచ్చే అంశం. మళ్ళీ
అధికారాన్ని నిలబెట్టుకుంటామన్న పరిస్థితులు ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్‌లో
కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ తనకు పోటీగా వస్తున్న ఆరోగ్యశాఖ
మంత్రి టి.ఎస్.సింగ్‌దేవ్‌ను దాదాపుగా పక్కకు తప్పించినట్లుగానే
కనిపిస్తోంది.
నరేంద్ర మోడీ పైనే ఆశలు
రాబోయే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీకి దీటుగా నిలబడే నేత ప్రతిపక్షం నుంచి
కనిపించడం లేదు. కరోనా వేళ ఉచిత బియ్యం పంపిణీ మొదలు ఉచిత గ్యాస్ సిలిండర్,
నల్లానీరు, విద్యుత్తు, పీఎం ఆవాస్ యోజన గృహాలు, ఉచిత ఆరోగ్యం, విద్యార్థులకు
ఉపకార వేతనాలు, ఎరువుల రాయితీ, కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు నగదు సహాయం
తదితర పథకాలు మోడీకి ఉపకరించాయి. పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేశామనే అంశాన్ని
బీజేపీ బాగా ప్రచారం చేసుకునే అవకాశాలున్నాయి.