కొత్త విధానానికి విపక్షాలు నో
న్యూఢిల్లీ : వలస కార్మికులను ఎన్నికల్లో భాగస్వామ్యం అయ్యేందుకు రూపొందించిన
ఆర్వీఎంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. సరికొత్త
ఓటింగ్ యంత్రం పనితీరును పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించింది. వారి
అభిప్రాయాలను ఈ నెలాఖరులోపు తెలపాలని కోరింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని
పెంచేందుకు సిద్ధం చేసిన రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం పనితీరుపై కేంద్ర
ఎన్నికల సంఘం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. 8 జాతీయ పార్టీలు, 57 ప్రాంతీయ
పార్టీల ప్రతినిధుల్ని ఆహ్వానించి ఢిల్లీలో సోమవారం ఆర్వీఎమ్ల గురించి
వివరించింది. ఆర్వీఎంలపై ఇప్పటికే పార్టీల అభిప్రాయం కోరిన ఈసీ ఈ నెలాఖరులోపు
పార్టీలు తమ వైఖరి తెలపాలని విజ్ఞప్తి చేసింది.
‘ఎన్నికల్లో వలస కార్మికుల భాగస్వామ్యాన్ని ఆర్వీఎంతో పెంచడం అనే విషయంపై
చర్చ’ అని పార్టీలకు ఈసీ లేఖలు రాసింది. ఈ కార్యక్రమంలో ఆర్వీఎంలు, ఈసీ
సాంకేతిక నిపుణుల కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఆర్వీఎం సాంకేతికత, వలస
కార్మికులను ఎలా నిర్వచిస్తారు? రిమోట్ ఓటింగ్ ఎలా జరుగుతుంది? ఓటర్లను ఎలా
గుర్తిస్తారు? తదితర విషయాలపై ఓ నోట్‌ను పార్టీలకు అందించింది.
గత నెల 29న కేంద్ర ఎన్నికల సంఘం ఆర్వీఎం ప్రతిపాదనను తెచ్చింది. రిమోట్
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ విధానాన్ని తేవడం వల్ల ఓటింగ్ శాతం
పెరుగుతుందన్నది ఈసీ వాదన. ఒకవేళ ఈ విధానం అమల్లోకి వస్తే వలస
కార్మికులు వారి సొంత జిల్లాలకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది.
రిమోట్ ఈవీఎం ప్రతిపాదనపై ప్రతిపక్షాల వ్యతిరేకత
ఎన్నికల సంఘం తీసుకు రావాలనుకున్న ఈ విధానాన్ని ప్రతిపక్ష పార్టీలు
వ్యతిరేకించాయి. ఎన్నికల సంఘం ప్రతిపాదనలో స్పష్టత లేదని కాంగ్రెస్ సీనియర్
నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ సారథ్యంలో ఆదివారం దిల్లీలోని
కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఆర్వీఎం విధానంపై అఖిలపక్షాల భేటీ జరిగింది. ఈ
సమావేశంలో కాంగ్రెస్, సీపీఎం, జేడీయూ, శివసేన, ఆర్జేడీ, పీడీపీ, జేఎంఎం,
వీసీకే సహా పలు పార్టీల ముఖ్య నేతలు హాజయ్యారు. భేటీ అనంతరం మాట్లాడిన
దిగ్విజయ్ సింగ్ ఆర్వీఎంను పార్టీలన్నీ ఏకగ్రీవంగా వ్యతిరేకించాయన్నారు.
ఇవి స్టాండలోన్ మెషిన్లా లేక ఇంటర్నెట్తో అనుసంధానం అవుతాయా? ఈ ఆర్వీఎమ్లకు
మైక్రో చిప్ ఎవరు సప్లై చేస్తున్నారు? సాఫ్ట్వేర్ ఎవరు అందిస్తున్నారు? అనే
విషయాలపై నిపుణులను సంప్రదించి తమ అభ్యంతరాలను ఈసీ ముందుకు తీసుకెళ్తామని
చెప్పారు.ఆర్వీఎం ఎలా పనిచేస్తుంది?. ఒకే పోలింగ్ బూత్ నుంచి 72
నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఈ రిమోట్ ఈవీఎం ను అభివృద్ధి
చేశారు. కౌంటింగ్ సమయంలో ఈ ఆర్వీఎంలు వేరే రాష్ట్రంలోని రిటర్నింగ్ అధికారి
వద్దకు వెళ్తాయి. ఈ యంత్రాలకు ఇంటర్నెట్తో సంబంధం లేదు. వీటిని ప్రభుత్వ రంగ
సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్
ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థలు తయారు చేశాయి.