న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ అప్పులు చెల్లించే పరిస్థితి లేక చేబదుళ్ల మీద
రోజులు నెట్టుకొస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో అదనపు రుణాలకు అనుమతిస్తే
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చేజేతులా నాశనం చేసినవారవుతారని ఎంపీ
రఘురామకృష్ణరాజు కేంద్ర ఆర్థిక శాఖకు సూచించారు. ఈ మేరకు ఆయన ఆర్థిక శాఖ
కార్యదర్శి టీవీ సోమనాథన్కు ఆరు పేజీల లేఖ రాశారు. ‘2022-23 ఆర్థిక
సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి రూ.46 వేల కోట్ల అప్పు తెచ్చుకోవడానికి
ఏపీకి ఇప్పటికే అనుమతిచ్చారు. నాబార్డు, విదేశీ రుణాలు, ఇతర కేంద్ర ప్రభుత్వ
అప్పులకు ఇది అదనం. రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్ పర్పస్
వెహికల్స్ ద్వారా తీసుకున్న రుణం రూ.9,03,436.58 కోట్లకు చేరింది. ఇది
రాష్ట్ర జీఎస్డీపీలో 75%కి సమానం. రాష్ట్ర ప్రభుత్వ వార్షికాదాయం రూ.1.50
లక్షల కోట్లు ఉంటే రుణం-వడ్డీల కింద రూ.55 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోంది.
రాష్ట్ర రెవెన్యూ లోటు త్వరలో రూ.50 వేల కోట్లు దాటే సూచనలు కనిపిస్తున్నాయి.
అయితే ప్రభుత్వం చేసే భారీ ఖర్చులు ప్రభుత్వరంగ సంస్థలు, ఎస్పీవీలు, ఇతర
సంస్థల ఖాతాల్లో చూపి రెవెన్యూలోటును దాచిపెట్టడంతో కాగ్ ఖాతా పుస్తకాల్లో
వాస్తవాలు ప్రతిఫలించడం లేదు. ఆదాయ లోటును భర్తీ చేసుకోవడానికి రాష్ట్ర
ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, ఎస్పీవీలు, ఇతర మార్గాల ద్వారా 2022 మార్చి
31 నాటికి రూ.2.5 లక్షల కోట్లకు పైగా బడ్జెటేతర రుణాలు తీసుకొంది. ఈ ఆర్థిక
సంవత్సరంలోనూ నాన్కన్వర్టబుల్ బాండ్లు జారీ చేసి స్టేట్ బెవరేజెస్
కార్పొరేషన్ ద్వారా రూ.8,305 కోట్ల అప్పు తెచ్చింది. ఇతరత్రా మార్గాల్లో మరో
రూ.12 వేల కోట్లు అప్పు చేసింది. ఇప్పటికే పరిమితులకు మించి అప్పు చేసినందున
ప్రభుత్వ రంగ సంస్థలు, ఎస్పీవీలు, ఇతర మార్గాల నుంచి చేసిన అప్పులను సర్దుబాటు
చేసేవరకూ ఏపీకి కొత్త అప్పులకు అవకాశం ఇవ్వొద్దు’ అని రఘురామకృష్ణరాజు లేఖలో
తెలిపారు.