కేంద్రం నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సరైనదేనని
సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. పెద్ద నోట్ల
రద్దును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. కేంద్ర
ప్రభుత్వం 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు
చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 58 పిటిషన్లు దాఖలయ్యాయి. 2016 డిసెంబర్ 16న
అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్.. ఈ వ్యాజ్యాల విచారణను ఐదుగురు సభ్యుల
ధర్మాసనానికి బదిలీ చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సర్వోన్నత
న్యాయస్థానం.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన రికార్డులను
అందజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలను గత డిసెంబరు 7న ఆదేశించింది. కేసు
విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణితోపాటు పిటిషనర్ల తరఫున
సీనియర్ న్యాయవాది పి.చిదంబరం, మరికొందరు న్యాయవాదులు వాదనలు వినిపించారు.