ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కలవర పెడుతున్న వేళ భారత్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. బీహార్లో సోమవారం ఐదుగురు విదేశీయులకు కరోనా సోకడం కలకలం రేపింది. గయ విమానాశ్రయంలో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి. కరోనా సోకిన ఐదుగురిలో నలుగురు థాయ్ లాండ్ వాసులు కాగా, ఒకరు మయన్మార్ వాసి అని తెలిసింది. హోటల్లో విదేశీయులు ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారు. వీరంతా గయలో దలైలామా ఉపన్యాసాలు వినేందుకు వచ్చినట్లు సమాచారం. వీరితో పాటు దలైలామా ఉపన్యాసాలు వినేందుకు భారీగా గయకు విదేశీయులు వచ్చినట్లు తెలిసింది. విదేశీయుల రాక సందర్భంగా విమానాశ్రయం, రైల్వే స్టేషన్లలో అధికారులు విస్తృతంగా కొవిడ్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తున్నారు.