మెహసాణా : నూతన విద్యావిధానం (ఎన్ఈపీ)లో ప్రస్తావించినట్లుగా మాతృభాషలో బోధిస్తే విద్యార్థుల్లో ఆలోచనా ధోరణి, విశ్లేషణ, పరిశోధక సామర్థ్యాలు పెరుగుతాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. గుజరాత్‌లోని విజాపుర్లో జి.సి. ఉన్నత పాఠశాల 95వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ఉన్నత, సాంకేతిక, వైద్య విద్య పాఠ్యాంశాలను (సిలబస్) దేశంలోని వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయన్నారు. నూతన విద్యావిధానం వచ్చే 25 ఏళ్లలో భారత్‌ను అత్యున్నత స్థానానికి చేర్చుతుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘‘విద్యార్థులకు సాధ్యమైనంత మేర ప్రాథమిక, మాధ్యమిక విద్యను వారి మాతృభాషలో బోధించడమే నూతన విద్యావిధానంలో కీలక అంశం. రానున్న రెండు, అయిదు, ఏడేళ్లలో దేశంలోని అందరు విద్యార్థులు మాతృభాషలో చదువుకుంటారని, తల్లులు పిల్లలకు ఇంటిదగ్గర పాఠ్యాంశాల్లోని సందేహాలను మాతృభాషలోనే వివరిస్తారన్న నమ్మకం ఉందని అమిత్ షా వ్యాఖ్యానించారు. వైద్య విద్యలో మొదటి సెమిస్టర్ సిలబస్‌ను అనువదించిన తర్వాత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో వైద్య విద్యను హిందీలో బోధిస్తున్న సంగతిని గుర్తుచేశారు. ‘‘గుజరాతీ, తెలుగు, ఒడియా, పంజాబీ, బెంగాలీ భాషల్లో ఉన్నత, వైద్య కోర్సులు ప్రారంభం కానున్నాయి. అప్పటి నుంచి పరిశోధన, అభివృద్ధికి సంబంధించి భారత్ నుంచి గణనీయ తోడ్పాటు మొదలవుతుందని చెప్పారు.