మధురాంతకం నరేంద్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
వారాల ఆనంద్ కు అనువాద పురస్కారం
ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్రను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది.
మరో రచయిత, కవి వారాల ఆనంద్‌కు సాహిత్య అకాడమీ అనువాద విభాగంలో అవార్డు
లభించింది. దక్షిణ భారతదేశంలో వందేళ్లకు పూర్వం ఉన్న దేవదాసీల వ్యవస్థ, ఆ
వ్యవస్థ పెరుగుదల, క్షీణత, దేవదాసీలుగా ఉండి ప్రముఖులైన మహిళల జీవితాలపై
విశ్లేషణాత్మకంగా నరేంద్ర రాసిన ‘మనోధర్మపరాగం’ నవల 2022 సంవత్సరానికి సాహిత్య
అకాడమీ అవార్డుకు ఎంపికైంది. ప్రకృతి వర్ణనలతో ప్రముఖ కవి గుల్జార్ హిందీలో
రచించిన ‘గ్రీన్ పోయెమ్స్’ను వారాల ఆనంద్ ‘ఆకుపచ్చ కవితలు’గా అనువదించారు.
దీనికి అనువాద పురస్కారం దక్కింది. మొత్తం 23 భాషల సాహితీకారులను పురస్కారాలకు
ఎంపిక చేసినట్లు అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు గురువారం దిల్లీలో
ప్రకటించారు. హిందీలో ‘తుమ్డీ కీ శబ్ద్’ కవితా సంకలనానికి బద్రీ నారాయణ్, ‘ఆల్
ది లైవ్స్ వియ్ లివ్డ్’ ఆంగ్ల నవలకు గాను అనూరాధ రాయ్, ‘ఖ్వాబ్ సరబ్’ ఉర్దూ
నవలా రచయిత అనిస్ అష్ఫఖ్, తమిళ నవల ‘కాలాపానీ’ రచయిత ఎం.రాజేంద్రన్‌లు కూడా
పురస్కారాలకు ఎంపికయ్యారు. అవార్డు గ్రహీతలకు రూ.లక్ష నగదు, తామ్ర ఫలకం,
శాలువా, జ్ఞాపిక ప్రదానం చేస్తారు. అనువాద పురస్కారం కింద రూ.50 వేల నగదు,
తామ్ర ఫలకం, శాలువా, జ్ఞాపిక బహూకరిస్తారు. సాహిత్య అకాడమీ పురస్కారానికి
జ్యూరీ సభ్యులుగా డాక్టర్ సి.ఎల్.ఎల్.జయప్రద, డాక్టర్ నందిని సిధారెడ్డి,
ప్రొఫెసర్ పి.కుసుమ కుమారి, అనువాద పురస్కారం జ్యూరీ సభ్యులుగా ప్రొఫెసర్
అల్లాడి ఉమ, డాక్టర్ ఎల్.ఆర్.స్వామి, నలిమెల భాస్కర్ వ్యవహరించారు.
తండ్రిని మించిన తనయుడు నరేంద్ర
సంగీత సాహిత్యాల్లో ప్రావీణ్యంతో దేవదాసీలు ఆ కళలను కాపాడుకుంటూ వచ్చారు.
బ్రిటిష్ పాలకులొచ్చాక దేవదాసీల ఈనాం భూములను రద్దు చేయడంతో వారి జీవితాల్లో
వచ్చిన మార్పులు, దేవదాసీల మనోగతాన్ని రచయిత మధురాంతకం నరేంద్ర తన
మనోధర్మపరాగం నవలలో స్కంద కుముదవల్లి పాత్ర ద్వారా చిత్తూరు యాసలో వివరించారు.
ఈ నవలకు గతంలో ‘ఆటా’ బహుమతి కూడా దక్కింది. తిరుపతి శ్రీ వేంకటేశ్వర
విశ్వవిద్యాలయంలో ఆంగ్ల అధ్యాపకుడిగా పనిచేసిన నరేంద్ర తెలుగు, ఆంగ్ల భాషల్లో
ప్రావీణ్యమున్న రచయిత, అనువాదకుడు. ఆయన 1957లో చిత్తూరు జిల్లా పాకాల మండలం
రమణయ్యపల్లెలో జన్మించారు. తండ్రి ప్రముఖ రచయిత మధురాంతకం రాజారాం, తల్లి
నాగభూషణమ్మ. పాలిటెక్నిక్ చదువుతున్న సమయంలోనే ‘చివరికి దొరికిన జవాబు’ పేరుతో
నరేంద్ర తొలి కథ రాశారు. తెలుగులో కుంభమేళా, అస్తిత్వానికి అటూ ఇటూ, రెండేళ్ల
పద్నాలుగు, ఆమ్‌స్టర్‌డామ్‌లో అద్భుతం, భూచక్రం, కొండకింద కొత్తూరు, రూపాంతరం,
వెదురుపువ్వు, మధురాంతకం నరేంద్ర కథలు, నాలుగు కాళ్ల మంటపం, ఇంగ్లిషులో
మైక్రోకాజమ్ ఆఫ్ మోడరన్ ఇండియా రచించారు. ఆస్కార్ వైల్డ్ ‘మోడల్ మిలియనీర్’ను
పెళ్లికానుకగా, ఎడ్గార్ అలెన్ పో ‘టెల్ టేల్ హార్ట్’ను నినదించే గుండెగా,
ఎర్నెస్ట్ హెమింగ్వే ‘ఇండియన్ క్యాంప్’ను అదే పేరుతో అనువదించడంతో పాటు పలు
ఆంగ్ల కథలు, పుస్తకాలను తెలుగులోకి తర్జుమా చేశారు. కొన్ని తెలుగు రచనలను
ఆంగ్లంలోకీ అనువదించారు. మొత్తం 14 తెలుగు, 12 ఆంగ్ల రచనలు చేసిన ఆయన పలు
పుస్తకాలకు సంపాదకత్వం కూడా వహించారు. 90కి పైగా వ్యాసాలు రాశారు. మద్రాసు
తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయాల పురస్కారాలు, కోటంరాజు రామారావు
అవార్డు, కేతు విశ్వనాథరెడ్డి కథా పురస్కారం సహా పలు అవార్డులు నరేంద్రను
గతంలో వరించాయి.
ప్రకృతికి పట్టం కట్టిన వారాల ఆనంద్ కవిత్వం
ప్రకృతిని కళ్లకు కట్టినట్లు సజీవ సాక్ష్యాలతో వర్ణించిన గుల్జార్ హిందీ
కవితలను తెలుగులోనే రాశారా అన్నట్లుగా వారాల ఆనంద్ అనువదించారు. కవిత్వం,
వచనం, సినిమా సమీక్షలు, వ్యాసాలు, డాక్యుమెంటరీ చిత్రాలు, తెలుగు, ఆంగ్ల
రచనలతో పాటు అనువాద రచనలతో బహుముఖ ప్రజ్ఞావంతునిగా గుర్తింపు పొందిన వారాల
ఆనంద్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 1958లో జన్మించారు. తల్లిదండ్రులు
అంజయ్య, అనూరాధ. ఆనంద్ చిన్నతనంలోనే వారి కుటుంబం కరీంనగర్ వచ్చి స్థిరపడింది.
అక్కడి ఎస్సారార్ కళాశాలలో ఆయన డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం ఉస్మానియా
విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో పీజీ, లైబ్రరీ సైన్స్ చదివారు. పలు
జూనియర్, డిగ్రీ కళాశాలల్లో లైబ్రేరియన్‌గా పనిచేశారు. 1981లో అలిశెట్టి
ప్రభాకర్, జింబో, వజ్జల శివకుమార్, పి.ఎస్.రవీంద్రలతో కలిసి మొదటి కవితా
సంపుటిని వెలువరించారు. ‘ఈనాడు’ దినపత్రికలో పదేళ్ల పాటు సాంస్కృతిక, సాహిత్య
విభాగాల విలేకరిగా పనిచేశారు. కొన్ని వారపత్రికల్లో వ్యాసాలు రాశారు. 1978లో
ఏర్పాటైన కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ (కఫిసో)లో సభ్యునిగా ఆయన సినిమా రంగంపైనా
దృష్టి సారించి విమర్శకునిగా రాణించారు. లయ, మానేరు తీరం, మనిషి లోపల, అక్షరాల
చెలిమె (కవిత్వం), మానేరు గలగల (సాహిత్య విమర్శ), మెరుపు (సాహిత్యకారుల
ముఖాముఖి), నవ్య చిత్ర వైతాళికులు, బాలల చిత్రాలు, సినీ సుమాలు, 24 ఫ్రేమ్స్,
తెలంగాణ సినిమా దశ-దిశ రచనలతో పాటు తెలంగాణ సాహితీమూర్తులు, శివ పార్వతులు,
లాంగ్ బాటిల్ విత్ షార్ట్ మెసేజెస్, ఏ రే ఆఫ్ హోప్, కఫిసో డాక్యుమెంటరీ
చిత్రాలను ఆయన నిర్మించారు.