విజయవాడలో 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభం
మూడు వేదికలకు ఆదికవి నన్నయ, పి.వి.నరసింహారావు, ఎన్టీఆర్ పేర్లు
విజయవాడ పీ.బి.సిద్ధార్థ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో రెండు రోజులపాటు నిర్వహణ
1,500 మందికి పైగా సాహితీ ప్రముఖుల రాక
జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు
వెంకయ్యనాయుడు
ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడ పీ.బి.సిద్ధార్థ డిగ్రీ కాలేజీ
ప్రాంగణంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. దేశ, విదేశాల నుంచి తెలుగు రచయితలు,
సాహితీ అభిమానులు తరలిరానున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం
గౌరవాధ్యక్షులు, అధికార భాషా సంఘం మాజీ చైర్మన్, మాజీ ఉపసభాపతి డా.మండలి
బుద్ధప్రసాద్, మాజీ మంత్రికామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ
మహాసభల గౌరవ అధ్యక్షుడిగా మాజీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ వ్యవహరించనుండగా
తెలుగు పరిరక్షణ, భాష, సంస్కృతి, చరిత్ర, సామాజిక రంగాలకు సంబంధించిన అంశాలపై
చర్చించనున్నారు.
స్వభాషను రక్షించుకుందాం… స్వాభిమానం పెంచుకుందాం
’స్వభాషను పరిరక్షించుకుందాం- స్వాభిమానాన్ని పెంచుకుందాం’ అనే నినాదంతో 5వ
ప్రపంచ తెలుగు రచయితల మహాసభ. కృష్ణాజిల్లా తెలుగు రచయితల సంఘం, ఉత్తర అమెరికా
తెలుగు సంఘం (తానా), తానా ప్రపంచ సాహిత్య వేదిక సిద్ధార్ధ అకాడమి (విజయవాడ)
సౌజన్యంతో ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో విజయవాడ మొగల్రాజపురంలోని
సిద్ధార్థ ఆర్ట్స్ మరియు సైన్స్ డిగ్రీ కళాశాలలో మహాసభలు జరుగుతున్నాయి.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్యవేదిక-అమెరికా, సిలికానాంధ్ర,
సిద్దార్ద అకాడెమీ, కృష్ణాజిల్లా రచయితల సంఘం సహకరిస్తున్నాయి. ప్రపంచం
నలుమూలల నుంచి దాదాపు 1500 మంది రచయితలు, భాషాభిమానులు ప్రతినిధులుగా
హాజరవుతున్నారు. ‘స్వభాషను రక్షించుకుందాం… స్వాభిమానం పెంచుకుందాం’ అనే
నినాదంతో తెలుగు సాహితీ ప్రముఖులంతా ఒకే వేదికపైకి వస్తున్నారు. తెలుగును
కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎలుగెత్తి చాటేందుకు దేశవిదేశాల
నుంచి రచయితలు, కవులు, సాహితీవేత్తలు తరలివస్తున్నారు. విజయవాడలోని
పి.బి.సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో శుక్ర, శనివారాల్లో అయిదో ప్రపంచ తెలుగు
రచయితల మహాసభలు జరగనున్నాయి. మన దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు అమెరికా,
ఆస్ట్రేలియా, దుబాయ్, ఫ్రాన్స్, సింగపూర్, బోట్స్వానా సహా పలు దేశాల నుంచి
సాహితీ ప్రముఖులు, భాషాభిమానులు 1,500 మందికి పైగా హాజరవుతున్నారు.
నాలుగేళ్లకోసారి మహాసభలు నిర్వహిస్తున్నారు. 2007లో ఆరంభమై 2011, 2015,
2019లలో జరిగాయి. అయిదో సభల కోసం సిద్ధార్థ కళాశాల ప్రాంగణాన్ని తెలుగు భాష,
సంస్కృతులు ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి
చేసిన రాజరాజ నరేంద్రుడి పేరును మహాసభల ప్రాంగణానికి పెట్టారు. మూడు వేదికలకు
ఆదికవి నన్నయ, పి.వి.నరసింహారావు, ఎన్టీఆర్ పేర్లను పెట్టారు. భాషాభివృద్ధికి
కృషి చేసిన మహనీయులు చిరస్థాయిగా జనం గుండెల్లో నిలిచిపోతారని చాటిచెప్పడానికే
ఈ పేర్లను పెట్టినట్టు ప్రపంచ తెలుగు రచయితలసంఘం కార్యదర్శి జి.వి.పూర్ణచందు
తెలిపారు.
37 కిలోల భారీ కలం : మహాసభల ప్రాంగణంలో ప్రదర్శనకు ఉంచిన 5.5 మీటర్ల పొడవు, 37
కిలోల బరువున్న పెన్ను ప్రత్యేక ఆకర్షణ. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్
రికార్డ్సులోనూ నమోదైంది. దీనిని ఆచార్య మాకునూరి శ్రీనివాస్ రూపొందించారు.
సాహితీ ప్రముఖులతో రాయిస్తామని రూపకర్త వెల్లడించారు. ఎనిమిది రకాల సంప్రదాయ
నృత్యాలకు సంబంధించిన నమూనాలు ఈ పెన్నుపై అలంకరించి ఉండడం మరో ప్రత్యేక ఆకర్షణ.
ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ఉద్దేశం ఇదే
ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు డా. మండలి బుద్ధ ప్రసాద్
ప్రపంచ నలుమూలల నుంచి సుమారుగా 1500 మంది రచయితలు ఈ మహాసభల్లో
పాల్గొనబోతున్నారని వివరించారు. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, చరిత్ర రంగాలపై
వాణిజ్య సంస్కృతి ప్రభావం బాగా కనిపిస్తోందన్నారు. సామాజిక విలువలను కాపాడుతూ,
భాష, సంస్కృతి, దేశీయ కళలు, సాహిత్యం, చరిత్రల అధ్యయనాల ద్వారా సామాజిక
చేతనత్వాన్ని కలిగించటానికి ప్రపంచ తెలుగు రచయితల సంఘం 5వ ప్రపంచ తెలుగు
రచయితల మహాసభలు నిర్వహిస్తోందని వివరించారు.
యువ అవధానులతో ‘కుదురాట-కొత్తవెలుగు’ : ప్రధాన కార్యదర్శి డా.జి.వి. పూర్ణచంద్
మహాసభలు జరిగే ప్రాంగణాన్ని తెలుగు భాషా పరిరక్షణకు పాటుబడిన రాజరాజనరేంద్రుడి
పేరు పెట్టామన్నారు ప్రధాన కార్యదర్శి డా.జి.వి. పూర్ణచంద్. ఆదికవి నన్నయ
వేదిక పై ప్రారంభసభ, సమాపన సభ, తెలుగు వెలుగుల సభ, ఇంకా ఇతర సదస్సులు,
సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. తెలుగు అకాడెమీ నిర్మాత,
అధికార భాషా సంఘం చట్టం తెచ్చిన వ్యక్తి, తెలుగు టైపు రైటర్ల సృష్టికర్త,
తొలి తెలుగు ప్రధాని పివి నరసింహరావు వేదిక పైన కవి సమ్మేళనాలు జరుగుతాయని
తెలిపారు. యువ అవధానులతో ‘‘కుదురాట-కొత్తవెలుగు’, 10 మంది యువ గజల్ కవుల
ముషాయిరా, 50 మందితో యువకవి సమ్మేళనం, 150 మందితో మహిళా కవిసమ్మేళనం, మోదుమూడి
సుధాకర్, డాపప సప్పా దుర్గాప్రసాద్, సంగీత నాటక అకాడెమీ సభ్యురాలు
డా.ఎస్.పి.భారతి సోదాహరణ ప్రసంగాలు వుంటాయని పేర్కొన్నారు. కళారత్న
కె.వి.సత్యనారాయణ బృందం ఆముక్తమాల్యద నృత్యరూపక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణ.
మాతృభాష పరిరక్షణకు ప్రజాచైతన్యాన్ని కలిగించటానికి రచయితల పాత్రపై వివిధ
సదస్సులలో చర్చలు జరుగనున్నాయని వివరించారు.
దేశ, విదేశాల నుండి 800 మంది ప్రతినిధులు : అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు
మొత్తం 30 సదస్సులలో దేశ, విదేశాల నుండి విచ్చేసిన 800 మంది ప్రతినిధులు
పాల్గొంటున్నారని గుత్తికొండ సుబ్బారావు వివరించారు. తెలుగు వెలుగుల సభలో భారత
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యన్. వి. రమణ, పద్మశ్రీ
గ్రహీతలు ఆచార్య కొలకలూరి ఇనాక్, అన్నవరపు రామస్వామి, దండమూడి సుమతీ
రామమోహనరావు, డా.గరికపాటి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి
జస్టిస్ ఎ.వి.శేషసాయి, సినీనటులు సాయికుమార్, గేయరచయితలు అందెశ్రీ,
జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భువనచంద్ర, సంగీతవేత్త స్వరవీణాపాణి
పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతినిధులకు రెండు రోజులు కమ్మని తెలుగు విందు
ఏర్పాట్లు చేశామని, 100కి పైగా రచయితలు తమ గ్రంథాలను ఈ సభల్లో
ఆవిష్కరించనున్నారని నిర్వాహకులు వివరించారు. శుభోధయం యూట్యూబ్ ఛానల్ ద్వారా
లైవ్, ప్రపంచ మహాసభలు పేరుతో వాట్సాప్ గ్రూపు ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్
వెల్లడి చేస్తామని వివరించారు.
తెలుగు విదేశీ, మహిళా పాత్రికేయ సదస్సు : విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు
నిమ్మరాజు చలపతిరావు
మారుతున్న సామాజిక పరిస్థితుల్లో రచయితల పాత్ర, ఉపాధ్యాయులు-భాషాపరిరక్షణ,
తెలుగు బోధన, సామాజికమార్పులు-తెలుగు కవిత, విమర్శ, చరిత్ర, అంతర్జాలంలో
తెలుగు విదేశీ, మహిళా పాత్రికేయ సదస్సు రాష్టేతర తెలుగు ప్రముఖులతో సదస్సులు
ఉంటాయని విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు వివరించారు.