36 మందికి గాయాలు
హొనొలులు : విమానాశ్రయంలో దిగడానికి కొద్దిసేపటి ముందు బలమైన గాలులు
కుదిపేయడంతో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడిన ఘటన హవాయిలో చోటు
చేసుకుంది. ఫీనిక్స్ నుంచి హొనొలులుకు ఆదివారం బయల్దేరిన ఈ విమానం హవాయి
ఎయిర్‌లైన్స్‌కు చెందినది. దీనిలో 300 మంది ప్రయాణిస్తున్నారు. సీటుబెల్టులు
సరిగా ధరించనివారు పైకెగిరి, విమానం పైకప్పును ఢీకొట్టి కింద పడ్డారు.
మరికొందరు అటూఇటూ ఊగిపోయి కిటికీలను, ముందునున్న సీట్లను ఢీకొట్టారు. సీట్ల
నుంచి విడివడి గాలిలో ఎగిరినట్లయిందని పలువురు ప్రయాణికులు చెప్పారు. విమానం
ఎత్తు రెండుసార్లు అకస్మాత్తుగా తగ్గిపోయిందన్నారు. మొత్తంమీద 36 మంది
ప్రయాణికులు గాయాలపాలయ్యారు. 20 మందిని ఆసుపత్రులకు తరలించాల్సి వచ్చింది.
కుదుపులకు గురైన విమానం అత్యవసరంగా కిందికి దిగేందుకు అనుమతించారు.