10 లక్షల మరణాలు
చైనాలో ఇక విధ్వంసమే!
కొవిడ్ ఆంక్షల సడలింపుతో చైనాలో రోజురోజుకూ కేసులు పెరుగుతుండగా తాజా నివేదిక
మరింత భయాందోళనకు గురిచేస్తోంది. ఈ శీతాకాలంలో డ్రాగన్ 3 కరోనా వేవ్‌లను
ఎదుర్కొవచ్చని నిపుణులు హెచ్చరించారు. ఇందులో ఒక వేవ్ తీవ్రత అధికంగా
ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు 2023లో చైనావ్యాప్తంగా 10 లక్షలకు పైగా కొవిడ్
మరణాలు సంభవిస్తాయని అమెరికా పరిశోధన సంస్థ అంచనా వేసింది. ప్రపంచ దేశాలను
ఎన్నో కరోనా వేవ్‌లు వణికించాయి. వైరస్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో
మాత్రం ఇలాంటి వేవ్‌లు కనిపించలేదు. దాదాపు మూడేళ్లుగా అక్కడక్కడా కొన్ని
కేసులు నమోదైనా వైరస్ వ్యాప్తి చెందకుండా జీరో కొవిడ్ విధానం, కఠిన ఆంక్షలతో
జిన్‌పింగ్ సర్కార్ కట్టడి చేసింది. అయితే, చైనా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు
వెల్లువెత్తడంతో ఈనెల ప్రారంభంలో పలు ఆంక్షలను సడలించడంతో కేసుల్లో భారీ
పెరుగుదల కనిపించింది.
తాజాగా చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్… చీఫ్
ఎపిడమాలజిస్ట్ వూ జున్యూ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ శీతాకాలంలో మెుత్తం
చైనాలో 3 వేవ్‌లు వస్తాయని అందులో ఒకటి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.
ప్రస్తుతం చైనాలో మెుదటి వేవ్ నడుస్తోందని జున్యూ తెలిపారు. ఈనెల 15 నుంచి
ప్రారంభమైన కొవిడ్ తొలివేవ్ జనవరి 15 వరకు ఎక్కువగా నగరాల్లో కొనసాగుతుందని
పేర్కొన్నారు. ఇక రెండో వేవ్ జనవరి చివరి నుంచి ఫిబ్రవరి 15 వరకు ఉంటుందని..
తెలిపారు.కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 21 నుంచి సెలవుల్లో కేసులు
పెరుగుతాయని జున్యూ వెల్లడించారు. ఈ సెలవు వారంలో లక్షలాది చైనీయులు
కుటుంబాలతో కలిసి విహారాలకు వెళ్తారని అందుకే కేసులు పెరుగుతాయని
పేర్కొన్నారు. ఇక ఫిబ్రవరి చివరి నుంచి మార్చి 15 వరకు మూడో వేవ్ ఉంటుందని
తెలిపారు. ఈ సమయంలో విహారయాత్రల నుంచి ప్రజలు తమ ఇళ్లకు చేరుకుంటారని అప్పుడు
కేసులు విపరీతంగా బయటపడతాయని వివరించారు. మరోవైపు, ఈ వారంలో కేసుల్లో
విపరీతమైన పెరుగుదల ఉంటుందని.. 2023లో కొవిడ్ కారణంగా చైనాలో 10 లక్షలకుపైగా
మరణాలు సంభవిస్తాయని.. అమెరికాకు చెందిన ఓ పరిశోధన సంస్థ నివేదిక
వెల్లడించింది.