మీకు సులభంగా పిల్లలు కావాలా?
గర్భం లేకుండానే బిడ్డల్ని కనొచ్చు
జర్మనీ పరిశోధకుడి ఆవిష్కరణ ‘ఎక్టోలైఫ్’
ఏడాదికి 30 వేల మంది పిల్లల్ని కనేలా పాడ్లు!
నైతిక నిబంధనల్ని తొలగిస్తే అందుబాటులోకి?
బెర్లిన్ : మహాభారతంలో కౌరవుల జన్మ వృత్తాంతం గుర్తుందా..? ధృతరాష్ట్రుడి
భార్య గాంధారీ దేవికి గర్భస్రావం కావడంతో ముక్కలైన ఆ పిండాన్ని వ్యాస మహర్షి
101 కుండల్లో పెట్టిస్తారు. ఆ కుండల నుంచే ఒక్కొక్కరిగా కౌరవులు జన్మిస్తారు.
అదే తరహాలో నిజంగానే తల్లి గర్భం అవసరం లేకుండా బిడ్డ జననం నిజంగా
సాధ్యమవుతుందా..? సాధ్యమేనంటున్నారు జర్మనీకి చెందిన బయోటెక్నాలజిస్టు హషీం
అల్-ఘైలీ. ‘ఎక్టోలైఫ్’ పేరిట తాను ఒక కృత్రిమ గర్భ వ్యవస్థను తాను సిద్ధం
చేశానని ఆయన చెబుతున్నారు. ఇందులో తల్లి గర్భంతో ఏమాత్రం పని ఉండదని, బిడ్డలు
తయారయ్యేందుకు వీలుగా పాడ్స్ ఉంటాయని, శిశువుల రంగు, పొడవు, బలాన్ని
తల్లిదండ్రులు ఎంచుకుని వారిని పొందవచ్చని ఆయన పేర్కొంటున్నారు. ఆసక్తికరంగా
ఉన్న ఆయన ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం ఐవీఎఫ్ విధానాన్ని చాలామంది విజయవంతంగా అనుసరిస్తున్న సంగతి
తెలిసిందే. ఇందులో తండ్రి శుక్రకణాన్ని, తల్లి అండాన్ని సేకరించి
ఫలదీకరిస్తారు. అనంతరం తిరిగి అదే తల్లి గర్భంలో లేదా వారు కోరిన అద్దె
గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా వైద్యులు వారికి బిడ్డని అందిస్తున్నారు. కానీ
హషీం చెబుతున్న వ్యవస్థలో తల్లి గర్భంతో అసలు సంబంధమే ఉండదు. శిశువులు
పూర్తిగా ఎక్టోలైఫ్ వ్యవస్థలోని ప్రత్యేక పాడ్(పెట్టె వంటి ఏర్పాటు)లలోనే
పిండం దశ నుంచి బిడ్డ దశ వరకూ ఎదుగుతారు. ఇందుకోసం అచ్చం తల్లి గర్భంలో ఉన్న
పరిస్థితులనే పాడ్‌లో ఏర్పాటు చేస్తారు. రెండు బయో రియాక్టర్లకు పరిశ్రమలోని
పాడ్లన్నీ అనుసంధానమై ఉంటాయి. ఆ రియాక్టర్లలో ఒకదాని నుంచి వచ్చే ద్రవాలు,
తల్లి గర్భంలో శిశువు చుట్టూ ఉండే ద్రవాల్లా పనిచేస్తాయి. శిశువుల దేహాల నుంచి
ఏవైనా వృథా వస్తే దాన్ని తొలగించేందుకు రెండో రియాక్టర్‌ను ఉపయోగిస్తారు.
ఇందుకోసం కృత్రిమ బొడ్డు పేగును కూడా శిశువులకు అమరుస్తారు. ఈ వ్యవస్థలో
శిశువు ఎటువంటి ఇన్ఫెక్షన్ల భయం లేకుండా పెరుగుతుందని హషీం వివరిస్తున్నారు.
‘‘తమ శిశువు ఉన్న పాడ్‌ను తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా ఎప్పటికప్పుడు
చూసుకోవచ్చు. అందుకోసం స్మార్ట్ డిజిటల్ తెరను ఎక్టోలైఫ్ వద్ద ఏర్పాటు
చేస్తాం. శిశువుల ఎదుగుదల, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, గుండె వేగం వంటి వన్నీ
అందులో కనిపిస్తాయి. ఫోన్ యాప్ ద్వారా కూడా తల్లిదండ్రులు ఆ వివరాలను
ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. పిల్లల పాడ్‌లో ఉన్న స్పీకర్ల ద్వారా
తల్లిదండ్రులు ఏ సంగీతం కోరితే ఆ సంగీతాన్ని వినిపిస్తాం. జన్యుపరంగా
భవిష్యత్తులో ఏదైనా అనారోగ్యం వస్తుందా అన్న విషయాన్ని కూడా ముందుగానే కృత్రిమ
మేధ ద్వారా గుర్తించవచ్చు. ఇప్పటికే అందుబాటులో ఉన్న జన్యు ఎడిటింగ్
సాంకేతికత ద్వారా బిడ్డ రంగు, ఎత్తు, బలం వంటివన్నీ ముందుగానే తల్లిదండ్రులు
నిర్ణయించుకోవచ్చు. శిశువు పాడ్‌లో పూర్తి స్థాయిలో ఎదిగిన తర్వాత ఒక బటన్
నొక్కితే చాలు, అందులోని ద్రవాలన్నీ బయటికి వెళ్లిపోతాయి. ఆ వెంటనే బిడ్డను
తల్లిదండ్రులు అందుకోవచ్చు. అనేక కారణాల వలన గర్భసంచి కోల్పోయిన మహిళలకు,
జనాభా తగ్గుదలతో బాధపడుతున్న జపాన్, బల్గేరియా, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఈ
కొత్త విధానం ఒక వరం. ఇప్పుడు ఉన్న సీ-సెక్షన్ ఆపరేషన్ల నరకాన్ని, నవజాత
శిశువుల మరణాల్ని తల్లులు ఎదుర్కోనవసరం ఉండదు. ఇక మా ఎక్టోలైఫ్ లో ఒక్కో
భవనంలో ఏడాదికి 30వేల మంది శిశువులను పుట్టించవచ్చు’’ అని హషీం
పేర్కొంటున్నారు.
మానవ అండంపై పరిశోధన, కృత్రిమ గర్భధారణ అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అనేక నైతిక
నిబంధనలున్నాయని హషీం పేర్కొన్నారు. తాను ఇప్పటికే వ్యవస్థను పూర్తిగా
తయారుచేసినప్పటికీ ఆనిబంధనలన్నీ తొలగితేనే ఎక్టోలైఫ్ ను తీసుకురాగలమని
వివరించారు. ఒకవేళ అలా తొలగించిన నేపథ్యంలో వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో అన్ని
దేశాల్లోనూ ఎక్టోలైఫ్ విస్తృతంగా అందుబాటులోకి వస్తుందని ఆయన జోస్యం
చెప్పారు. కాగా ఎక్టోలైఫ్ గురించి యూకేలోని ఓ పత్రిక సర్వే నిర్వహించగా
80శాతం మంది దానికి విరుద్ధంగా ఓటేయడం గమనార్హం. మంచో చెడో, ప్రకృతిపరంగా
జరిగేదే ఎప్పుడూ అర్థవంతమైనదని వారి అభిప్రాయపడటం విశేషం.