వ్యాక్సిన్ కొరతపై డబ్ల్యుహెచ్ఓ ఆందోళన
ప్రపంచవ్యాప్తంగా కలరా వ్యాధి వ్యాప్తి అధికంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ
పేర్కొంది. ప్రతిఏటా సాధారణ కేసులతో పోలిస్తే ఈ ఏడాది వ్యాధి వ్యాప్తి మూడు
రెట్లు అధికంగా ఉందని తెలిపింది. ఇదే సమయంలో కలరా వ్యాక్సిన్ కొరత ఏర్పడటంపై
డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కలరా వ్యాప్తి
విజృంభణ కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇదే సమయంలో ఈ
వ్యాధి నిరోధానికి అవసరమైన టీకా నిల్వలు ఖాళీ అవడం/కనీస స్థాయికి పడిపోయినట్లు
ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 30 దేశాల్లో కలరా వ్యాప్తి అధికంగా ఉందన్న
డబ్ల్యూహెచ్ఓ అంతర్జాతీయంగా మరణాల రేటు పెరుగుతోందని తెలిపింది. ఏటా
చోటుచేసుకునే కేసులతో పోలిస్తే వ్యాధి వ్యాప్తి ఈ ఏడాది మూడు రెట్లు అధికంగా
ఉందని పేర్కొంది.చాలా దేశాల్లో కలరా వ్యాప్తి పెరుగుతోంది. ప్రస్తుతం
డిమాండుకు సరిపడా టీకాలు మా వద్ద లేవు. చాలా దేశాలు విజ్ఞప్తి
చేస్తున్నప్పటికీ వాటిని అందించడం సవాలుగా మారింది’ అని ప్రపంచ ఆరోగ్య
సంస్థలోని కలరా, అంటువ్యాధుల విభాగాధిపతి డాక్టర్ ఫిలిప్ బార్బోజా
పేర్కొన్నారు. కలరా టీకా కొరత ఏర్పడిన నేపథ్యంలో రెండు డోసుల్లో తీసుకోవాల్సిన
టీకాను ప్రస్తుతానికి ఒక డోసుకే పరిమితం చేశామన్నారు. అయినప్పటికీ డిమాండుకు
సరిపడా టీకాలు అందుబాటులోకి లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తేలికైన
చికిత్స, ఎంతో కాలంగా వ్యాప్తిలో ఉన్న కలరా వల్ల 21వ శతాబ్దంలోనూ ప్రజలు
ప్రాణాలు కోల్పోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. కలరా టీకాకు సంబంధించి ఏటా 3.6కోట్ల
డోసులను ప్రపంచ ఆరోగ్య సంస్థ అందుబాటులో ఉంచుతుంది. కానీ, ఇటీవల కరోనా
మహమ్మారి విజృంభణతో కొవిడ్ టీకాపైనే తయారీ సంస్థలు దృష్టి సారించాయి. దీంతో
కలరా టీకా తయారు చేసేందుకు సంస్థలు ముందుకు రావడం లేదని.. తద్వారా కొరత
ఏర్పడుతోందని ఆరోగ్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.