పినామ్పెన్ : ఆగ్నేయాసియాలో శాంతి, సుస్థిరత, స్వేచ్ఛాయుత నౌకాయానం, భద్రత,
సుసంపన్నత లక్ష్యంగా ఈ ప్రాంతంలోని దేశాలతో కలిసి పనిచేయాలని అమెరికా
ఆకాంక్షిస్తోందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. ఇండో-పసిఫిక్
వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఆసియాన్ కూటమిలోని 10 దేశాలు తమకు ఎంతో కీలకమైనవని
వెల్లడించారు. కంబోడియా రాజధాని పినామ్పెన్లో శనివారం యుఎస్-ఆసియాన్
సదస్సులో బైడెన్ ప్రసంగించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆధిపత్యాన్ని
చెలాయిస్తున్న చైనాను నిలువరించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్న విషయం
తెలిసిందే. దక్షిణ చైనా సముద్రం నుంచి మయన్మార్ వరకు ఎదురవుతున్న సవాళ్లకు
వినూత్న పరిష్కారాలను కనుగొనేందుకు ఉమ్మడిగా కృషి చేద్దామని బైడెన్
పిలుపునిచ్చారు. పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లోనూ కలిసి
పనిచేసేందుకు అవకాశం ఉందన్నారు. ఇండోనేసియాలోని బాలిలో సోమవారం నిర్వహించే
జీ20 దేశాల సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో బైడెన్ భేటీ
కానున్నారు. ఇటువంటి తరుణంలో దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛాయుత నౌకాయానం
గురించి అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆసియాన్ కూటమిలో
బ్రూనై, కంబోడియా, ఇండోనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలిప్పీన్స్,
సింగపూర్, వియత్నాం, థాయ్‌లాండ్ సభ్యదేశాలు. సైనిక పాలన కొనసాగుతున్న
మయన్మార్ నుంచి సదస్సుకు ఎవరూ హాజరుకాలేదు.
ఉగ్రవాదం అణచివేతకు ప్రతిన : మానవాళికి ముప్పుగా మారిన ఉగ్రవాదాన్ని
నిర్మూలించేందుకు పరస్పరం సహకరించుకోవడంతో పాటు సమగ్ర వ్యూహాత్మక
భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు భారత్, ఆసియాన్ దేశాలు ప్రతిన
బూనాయి. అంతకుముందు ఆసియాన్-ఇండియా 19వ సదస్సులో భారత ఉపరాష్ట్రపతి జగదీప్
ధన్‌ఖడ్ ప్రసంగించారు. ఆసియాన్, భారత్ మధ్య స్నేహబంధానికి ఈ ఏడాదితో 30
ఏళ్లు పూర్తయ్యాయి. డిజిటల్ టెక్నాలజీ, సైబర్‌సెక్యూరిటీ రంగాల్లోనూ
సహకారాన్ని బలోపేతం చేసుకోనున్నట్లు సదస్సు అనంతరం వెలువడిన సంయుక్త ప్రకటన
వెల్లడించింది.