రాజకీయ ప్రత్యర్థులపై ఉక్కుపాదం
ఆరేళ్ల అజ్ఞాతవాసం.. అలుపెరగని పోరాటం
బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు
ఢాకా: ఆమె ఓ కరడుగట్టిన నియంత అని రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తుంటారు. ఆమె అభిమానులు మాత్రం సైనిక ప్రభుత్వ కబంధ హస్తాల్లో నలిగిన దేశానికి స్థిరత్వాన్ని అందించి, అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఉక్కు మహిళ అంటూ నీరాజనాలు పలుకుతుంటారు. రాళ్లు విసిరినా, పూలు చల్లినా ఖాతరు చేయక మొండి వైఖరితో ముందుకు సాగుతూ సుమారు 15 ఏళ్లుగా బంగ్లాదేశ్ రాజకీయాలను ఏకఛత్రాధిపత్యంతో శాసిస్తున్న ఆ మహిళే 76 ఏళ్ల షేక్ హసీనా. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన పార్టీ అవామీ లీగ్‌ను మరోసారి విజయ శిఖరాలకు చేర్చిన హసీనా వరుసగా నాలుగోసారి, మొత్తంగా అయిదోసారి దేశ అధికార పగ్గాలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. తద్వారా దేశ రాజకీయాల్లో తిరుగులేని నేతగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనున్నారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం దేశాధినేతలుగా కొనసాగిన మహిళల్లో ఒకరిగా ఆమె ప్రత్యేకత చాటుకున్నారు.
ఆరేళ్ల అజ్ఞాతవాసం.. అలుపెరగని పోరాటం : బంగ్లాదేశ్ జాతిపిత ముజీబుర్ రెహమాన్ కుమార్తె అయిన షేక్ హసీనా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూశారు. 1947 సెప్టెంబరులో తూర్పు పాకిస్థాన్(ప్రస్తుత బంగ్లాదేశ్)లో జన్మించిన హసీనా.. 60వ దశకంలో ఢాకా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. పాక్ ప్రభుత్వం ముజీబుర్ను జైల్లో పెట్టినప్పుడు ఆయన రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షించారు. పాక్ నుంచి బంగ్లాదేశ్‌కు 1971లో స్వాతంత్య్రం వచ్చాక ముజీబుర్ దేశాధ్యక్షుడిగా, ఆ తర్వాత ప్రధానిగా సేవలందించారు. అయితే 1975లో హసీనా జీవితంలో పెను విషాదం చోటుచేసుకుంది. సైనికాధికారుల చేతిలో తన తండ్రి ముజీబుర్, తల్లి, ముగ్గురు సోదరులూ దారుణ హత్యకు గురయ్యారు. హసీనా, ఆమె చెల్లెలు షేక్ రెహానా ఆ సమయంలో విదేశాల్లో ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నారు. షేక్ హసీనా ఆరేళ్ల పాటు భారత్‌లో తలదాచుకున్నారు. తన తండ్రి స్థాపించిన అవామీ లీగ్‌కు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యాక 1981లో స్వదేశానికి తిరిగివచ్చారు. సైనిక ప్రభుత్వ ఆగడాలపై పోరాటం చేసి పలుమార్లు గృహ నిర్బంధానికి గురయ్యారు. 1991 ఎన్నికల్లో ఓటమి పాలైన అవామీ లీగ్‌ను 1996లో విజయ తీరాలకు చేర్చిన హసీనా ప్రధాని పీఠాన్ని దక్కించుకున్నారు. అయితే 2001 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు. అదే అవామీ లీగ్‌కు చివరి ఓటమి. ఆ తర్వాత 2008 నుంచి తాజా ఎన్నికల వరకూ వరుసగా నాలుగు సార్లు అవామీ లీగ్‌ను విజయ పథంలో నడిపించి సత్తా చాటారు హసీనా. 2004లో ఓ ర్యాలీ సమయంలో గ్రనేడ్ పేలుడు నుంచి ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.
రాజకీయ ప్రత్యర్థులపై ఉక్కుపాదం : 2008లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులను ఉక్కుపాదంతో అణచివేసినట్లు హసీనాపై విమర్శలు ఉన్నాయి. 1971 యుద్ధ నేరాల కేసుల విచారణకు ఆమె 2009లో ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాలకు చెందిన పలువురు ప్రముఖులను అది దోషులుగా తేల్చింది. దీంతో దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(బీఎన్పీ)కి కీలక మిత్రపక్షమైన జమాత్-ఏ-ఇస్లామీపై 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా హసీనా నిషేధం విధించారు. అవినీతి కేసుల్లో బీఎన్పీ చీఫ్ ఖలేదా జియాకు 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ విధంగా ప్రధాన ప్రతిపక్షాన్ని హసీనా చావుదెబ్బ కొట్టారు. అప్పటి నుంచి ఎన్నికల బరిలో అవామీ లీగ్‌కు తిరుగులేకుండా పోయింది. దీనికి నిరసనగా 2014, 2024 ఎన్నికలను బీఎన్పీ బహిష్కరించింది. దీంతో అవామీ లీగ్‌కు ఎన్నికలకు ముందే విజయం ఖరారైంది.
అంతర్జాతీయంగా ప్రశంసలు : మయన్మార్ నుంచి శరణార్థులుగా వచ్చిన 10లక్షల మందికిపైగా రోహింగ్యాలకు తమ దేశంలో ఆశ్రయం కల్పించడం ద్వారా హసీనా అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు. భారత్, చైనా లాంటి రెండు బలమైన దేశాలతో ఏకకాలంలో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ వాటి మద్దతు కూడగట్టుకోవడం హసీనా దౌత్య చతురతకు నిదర్శనం. హసీనా 2009లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకూ బంగ్లాదేశ్ తలసరి ఆదాయం మూడురెట్లు పెరిగింది. గతేడాది దేశ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 7.28 శాతం పెరుగుదల నమోదైంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) కూడా హసీనా పాలనలో జరుగుతున్న అభివృద్ధిని ప్రశంసించింది.