రిపబ్లికన్ పార్టీ తాజా పోలింగ్‌లో రెండో స్థానంలో వివేక్ రామస్వామి
డొనాల్డ్ ట్రంప్ మొదటి స్థానంలో ఉన్నా.. ఆయనకు కేసుల అడ్డంకి ?
డెమొక్రటిక్ అభ ్యర్థి జో బైడెన్‌పై పోటీకి మిగిలేది రామస్వామే!
ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు.. ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకం
ఎఫ్‌బీఐ తదితర సంస్థలు మూసేస్తానని ప్రతిన.. మస్క్ మద్దతూ ఆయనకే
వాషింగ్టన్, ఆగస్టు 20: అమెరికా అధ్యక్ష పదవి కోసం రిపబ్లికన్ పార్టీలో
పోటీపడుతున్నవారిలో భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త వివేక్
రామస్వామి క్రమంగా దూసుకుపోతున్నారు. తాజాగా ఎమెర్సన్ కాలేజీ వద్ద
నిర్వహించిన పోలింగ్‌లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 56 శాతం ఓట్లతో
మొదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో రామస్వామి, ఫ్లోరిడా గవర్నర్ రాన్
డేశాంటిస్ 10 శాతం చొప్పున ఓట్లతో పోటాపోటీగా నిలిచారు. అయితే, రామస్వామి
మద్దతుదారుల్లో అత్యధికులు(దాదాపు సగం మంది) ఆయనకే ఓటు వేస్తామని గట్టిగా
చెబుతుండగా, డేశాంటిస్(Desantis) మద్దతుదారుల్లో మాత్రం తడబాటు కనిపిస్తోంది.
డేశాంటిస్ మద్దతుదారుల్లో 3వ వంతు మంది మాత్రమే ఆయనకు ఓటు వేస్తామని దృఢంగా
చెబుతున్నారు. జూన్‌లో నిర్వహించిన పోలింగ్‌లో 21% ఓట్లు సాధించిన డేశాంటిస్
తాజా పోలింగ్‌లో 10% ఓట్లకు పడిపోవడం గమనార్హం. మరోవైపు రామస్వామికి 2% ఓట్లు
పెరగడం విశేషం. పోస్టుగ్రాడ్యుయేట్ ఓటర్ల మద్దతు రామస్వామికి పెరుగుతోందని,
వారిలో 17 శాతం మంది ఆయనకు మద్దతుగా నిలిచారని ఎమెర్సన్ కాలేజ్ పోలింగ్
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పెన్సర్ కింబల్ చెప్పారు. ట్రంప్ మొదటి
స్థానంలో కొనసాగుతున్నప్పటికీ ఆయనపై ఉన్న కేసుల దృష్ట్యా రెండో స్థానంలో
దూసుకుపోతున్న రామస్వామికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. డెమొక్రటిక్
పార్టీ అభ్యర్థి జో బైడెన్‌పై పోటీలో నిలిచే అవకాశం ఆయనకే ఉంటుందని
భావిస్తున్నారు.
కేరళ నుంచి వచ్చిన దంపతులకు జననం : 38 ఏళ్ల వయసున్న రామస్వామి భారతదేశంలోని
కేరళ నుంచి వలస వచ్చిన దంపతులకు ఒహియోలో జన్మించారు. హార్వర్డ్ యూనివర్సిటీలో
బయోలాజికల్ డిగ్రీ, యేల్ యూనివర్సిటీలో లా పూర్తిచేశారు. తొలుత బయోటెక్
సంస్థను స్థాపించిన రామస్వామి గతేడాది ఒక ఆస్తి నిర్వహణ సంస్థను
ప్రారంభించారు. ‘వోక్ ఇంక్’ సహా అనేక పుస్తకాలను ఆయన రచించారు. ఆ పుస్తకాల
ద్వారానే ఆయన అనేకమందికి పరిచయమవుతున్నారు. పాలనా అంశాలతోపాటు కంపెనీల
విధానాలు, వాతావరణ, సామాజిక అంశాలనూ ప్రస్తావిస్తుండటం ఆయన ప్రచారంలో
సానుకూలంగా మారింది. ఒహాయో స్టేట్ యూనివర్సిటీ వెక్స్నర్ మెడికల్
సెంటర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అపూర్వను రామస్వామి వివాహం
చేసుకున్నారు.
రామస్వామి ఆశాజనక అభ్యర్థి: మస్క్
టెస్లా, ట్విటర్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్కూడా రామస్వామికి మద్దతు
ప్రకటించారు. ‘రామస్వామి చాలా ఆశాజనక అభ్యర్థి’ అని మస్క్ ట్వీట్ చేశారు.
రామస్వామి యుద్ధాలకు, వలసలకు వ్యతిరేకి. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు
పలుకుతానని కూడా రామస్వామి చెప్పారు. పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ దేశానికి
మిలటరీ సాయాన్ని 2028 తర్వాత అమెరికా నిలిపివేయాలని రామస్వామి తేల్చిచెప్పారు.
ఇజ్రాయిల్‌కు 38 బిలియన్ డాలర్ల ప్యాకేజీ అమెరికా సాయం ఆ ఏడాదితో ముగియనుంది.
అమెరికాలో మత స్వేచ్ఛను తాను కాపాడతానన్నారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర
మోదీ గొప్ప ప్రధాని అని, అత్యుత్తమ నాయకుడని ఒక ఇంటర్వ్యూలో రామస్వామి
కొనియాడారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారంగా మారిన ఎఫ్‌బీఐ, ఐఆర్ఎస్, అణు
నియంత్రణ కమిషన్ తదితర అనేక ఫెడరల్ సంస్థలను మూసివేస్తానని కూడా ఆయన
ప్రతినబూనారు.