కీవ్ : ఉక్రెయిన్ ఎదురుదాడులను నిర్వీర్యం చేసే క్రమంలో క్షిపణి దాడులను
రష్యా ఉద్ధృతం చేసింది. సోమవారం ఏకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
స్వస్థలం క్రివి రిహ్పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఆరుగురు
మరణించగా 75 మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో పదేళ్ల చిన్నారి కూడా ఉంది. ఓ
అపార్ట్మెంటులో నాలుగు, తొమ్మిది అంతస్తుల మధ్య ప్రాంతాన్ని క్షిపణి దారుణంగా
దెబ్బతీసింది. నాలుగు అంతస్తుల విశ్వవిద్యాలయ భవనాన్ని కూడా రష్యా
కూల్చేసింది. పౌర నివాసాలపై దాడి చేయకూడదనే సంప్రదాయం ఉన్నా, దాన్ని
ఉల్లంఘించిన రష్యా అపార్ట్మెంట్లపై విరుచుకుపడుతోందని ఉక్రెయిన్ అంతరంగిక
మంత్రి ఆరోపించారు.
ఉక్రెయిన్ సైనిక స్థావరాలపైనే తాము దాడులు చేస్తున్నట్లు రష్యా చెబుతోంది.
రష్యా ఆక్రమించిన తమ ప్రాంతాలపై ఉక్రెయిన్ అడపాదడపా దాడులను పెంచుతోంది.
క్రమేపీ యుద్ధం రష్యా భూభాగంలోకి వెళ్తోందని, ఇది తప్పనిసరైన, సహజమైన,
సముచితమైన ప్రక్రియ అని జెలెన్స్కీ పేర్కొన్నారు. ‘‘ఉక్రెయిన్ సైన్యంలోని
అశక్తత రోజురోజుకూ బయటపడుతోంది. నాటో కూటమి ఇచ్చిన ఆధునిక ఆయుధాలను కూడా వారు
సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇది నాటోలో, ఆయా దేశాల్లోని ప్రజల్లో తమ
డబ్బు వృథా అవుతోందనే భావన కలుగచేస్తోందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి
దిమిత్రి పెస్కోవ్ ఎద్దేవా చేశారు. వాగ్నర్లో తాజా నియామకాలు నిలిచిపోయాయని
ఆ సంస్థ అధినేత ప్రిగోజిన్ వెల్లడించారు.