వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహామండలిలో మరో భారతీయ
అమెరికన్‌కు చోటు దక్కింది. బైడెన్ స్వదేశీ విధాన సలహాదారుగా 52 ఏళ్ల నీరా
టండన్ నియమితులయ్యారు. స్వదేశీ విధానం, ఆర్థిక, రక్షణ విధానాల రూపకల్పనలో
అధ్యక్షుడికి మూడు ఉన్నత మండళ్లు సాయపడతాయి. అందులో ఒక దానికి భారతీయ
అమెరికన్ సారథ్యం వహించడం ఇదే ప్రథమం. 2024 అధ్యక్ష ఎన్నికలకు ముందు స్వదేశీ
విధాన రూపకల్పనకు నీరాను నియమించడం కీలక పరిణామం. ఆర్థికాభివృద్ధి, జాతుల మధ్య
సమానత్వం, ప్రజారోగ్యం, విద్య, వలస వ్యవహారాలపై ఆమె తనకు సహకరిస్తారని బైడెన్
ప్రకటించారు. నీరా ముగ్గురు దేశాధ్యక్షుల (ఒబామా, బిల్ క్లింటన్, బైడెన్)
నాయకత్వంలో పనిచేశారని గుర్తుచేశారు.