రెండో ప్రపంచ యుద్ధం నాటి వ్యూహాలకు రష్యా పదునుపెడుతోంది. ఇప్పటికే ఆక్రమించుకొన్న ఉక్రెయిన్ భూభాగాలను కాపాడుకొనేందుకు రక్షణ వ్యూహాలు పన్నుతోంది.
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం: రష్యా అమ్ములపొదిలో ప్రకృతి ఇచ్చిన అత్యంత శక్తిమంతమైన ఆయుధం ఉంది. ఈ ఆయుధంతో ప్రపంచాన్ని గడగడలాడించిన నెపోలియన్ బోనాపార్టే, హిట్లర్ వంటి దిగ్గజాల సేనలను కూడా రష్యన్లు తుక్కుగా ఓడించారు. మరికొన్ని వారాల్లో ఉక్రెయిన్, నాటో సేనలకు వ్యతిరేకంగా ఈ అదృశ్య ఆయుధాన్ని వాడేందుకు క్రెమ్లిన్ పరిస్థితులను సిద్ధం చేస్తోంది. తాజాగా నాటో కూడా ఈ ఆయుధాన్ని చూసి ఆందోళన చెందుతోంది. ఆ ఆయుధమే శీతాకాలం. చాలా కీలక యుద్ధాల్లో విజయాన్నందించిన చలికాలాన్ని రష్యన్లు గౌరవంగా ‘జనరల్ వింటర్’ లేదా ‘జనరల్ ఫ్రాస్ట్’ పేరిట పిలుచుకొంటారు.
రష్యాలో మంచు ఎందుకంత ప్రమాదకరం..:రష్యాలో శీతాకాలం అత్యంత కఠినంగా ఉంటుంది. ఈ సీజన్లో రష్యాపై దండయాత్ర చేయడం, ఆక్రమణలు చేయడం శత్రుసేనలకు ఆత్మహత్యతో సమానం. ప్రత్యర్థులకు అవసరమైన వనరులు అందకుండా చేస్తూ.. ఆత్మరక్షణ వ్యూహాన్ని పాటిస్తే చాలు.. ఎముకలు కొరికే చలే ప్రత్యర్థిని చంపేస్తుంది. ఈ చలిలో ముందుకు వెళ్లాలంటే.. సాధారణ వాహనాలు సరిపోవు. ఆయుధాలు పనిచేయాలంటే ప్రత్యేకమైన లూబ్రికెంట్లు అవసరం. దళాలకు ప్రత్యేకమైన దుస్తులు, బూట్లు అవసరం. దళసభ్యులు గాయపడితే ప్రాణంపై ఆశలు వదులుకోవడమే. ఇక చలికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఉండనే ఉన్నాయి.
చరిత్రలో ఈ చలిని గెలిచినవారే లేరు..:
* 1708లో స్వీడన్ రాజు చార్లెస్ XII రష్యాపై దండెత్తాడు. అప్పుడు రష్యన్లు స్కార్చ్డు-ఎర్త్ వ్యూహాన్ని అమలు చేశారు. 18వ శతాబ్దంలోనే అత్యంత కఠినమైన శీతాకాలం ఆ సీజన్లో రావడం రష్యన్లకు వరంగా మారింది. ఈ యుద్ధానికి ముందు చార్లెస్ బలగం 35,000 మంది కాగా.. యుద్ధం చివరి నాటికి 19,000కు పడిపోయింది. ఈ యుద్ధం తర్వాత స్వీడిష్ సామ్రాజ్యం పతనం మొదలైంది.
* 1812లో నెపోలియన్ సేనలు రష్యాపై దాడి చేసి మాస్కోను ఆక్రమించుకొన్నాయి. కానీ, ఆ తర్వాత రష్యా శీతాకాలం చలి కారణంగా దారుణంగా దెబ్బతిన్నాయి. నవంబర్‌లో ఒక్క రాత్రే 10 వేల మంది నెపోలియన్ సేనలు మరణించాయంటే.. చలి ఏ స్థాయిలో దెబ్బతీసిందో అర్థం చేసుకోవచ్చు.
* రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా మంచును అంచనా వేయకుండా హిట్లర్ మాస్కో లక్ష్యంగా 1941 సెప్టెంబర్‌లో ‘ఆపరేషన్ బార్బరోస్సా’ను మొదలుపెట్టాడు. ఈ దాడి పూర్తిగా బెడిసి కొట్టింది. దాదాపు 30లక్షల మందికిపైగా సైనికులు రష్యాపైకి దండెత్తారు. కానీ, ఇక్కడ కూడా రష్యా శీతాకాలం దెబ్బకు జర్మనీ సైనికులు తీవ్ర నష్టాలను చవిచూశారు. డిసెంబర్లో సోవియట్ సేనలు ఎదురుదాడి మొదలుపెట్టి జర్మనీ సేనలను తరిమికొట్టాయి. ఈ ఓటిమితో రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీకి ఓటమి మొదలైంది.
ఉక్రెయిన్ పరిస్థితి కొంచె భిన్నం.. కానీ..: నెపోలియన్, హిట్లర్ సేనలు రష్యా చలికి అలవాటుపడలేదు. కానీ, పొరుగుదేశమైన ఉక్రెయిన్‌కు ఈ పరిస్థితి బాగా తెలుసు. చలి కాలంలో ఇళ్లను, సైనిక స్థావరాలను వెచ్చగా ఉంచుకోవడానికి భారీగా ఇంధనం, విద్యుత్తు అవసరం. ఇది తెలిసే రష్యా సేనలు ఉక్రెయిన్ విద్యుత్తు, తాగునీటి వ్యవస్థలపై గురిపెట్టి దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే జపొరిజియా అణుకేంద్రం రష్యా స్వాధీనం చేసుకొని.. ఉక్రెయిన్ గ్రిడ్ నుంచి దానిని వేరు చేసింది. దీంతో దాదాపు 30శాతం విద్యుత్తు లభ్యత ఉక్రెయిన్‌కు తగ్గిపోయింది. మరోవైపు దక్షిణ ఉక్రెయిన్‌లోని కఖోవ్కా డ్యామ్‌ను పేల్చివేయడానికి మాస్కో యత్నిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే జలవిద్యుత్తు లభ్యత కూడా ఉక్రెయిన్‌కు తగ్గిపోతుంది. దీంతోపాటు తాగునీటి సరఫరాలపై రష్యా దాడులు చేయడంతో ఉక్రెయిన్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇవన్నీ కఠిన శీతాకాల పరిస్థితులను సృష్టించడానికి రష్యా చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే. చలి పెరిగే కొద్దీ ఇళ్లల్లో ఉష్ణం లేక ప్రజలు వలసపోవడమో.. చలికి బలికావడమో జరిగే పరిస్థితి తలెత్తుతుంది. ఫలితంగా రష్యాతో రాజీకి వెళ్లి యుద్ధ విరమణ చేసుకొవాలని ప్రజల నుంచి డిమాండ్లు పెరుగుతాయి. మరోవైపు ఖేర్సాన్, ఖర్కీవ్లపై దాడులు చేసి తమ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడంపై ఉక్రెయిన్ దృష్టిపెట్టింది. పగటి సమయం తక్కువగా ఉండటం, వాతావరణం కఠినంగా మారడంతో సాధరణ రోజుల్లో కంటే ఉక్రెయిన్ సైన్యం మరింత చురుగ్గా ఉండాల్సిన అవసరముంటుంది. సెన్సర్లు, ఆయుధాలు సక్రమంగా పనిచేయవు. మరో వైపు రష్యా సేనలు కూడా ఉక్రెయిన్‌లోకి చొచ్చుకు వెళ్లలేని పరిస్థితి తలెత్తుతుంది. మరోవైపు ఉక్రెయిన్‌కు శీతాకాలంలో అవసరమైన సరఫరాలను పలు నాటో దేశాలు అందజేస్తున్నాయి. ఇప్పటికే కెనడా నుంచి 5 లక్షల వింటర్ యూనిఫామ్‌లు వచ్చాయి. మరోవైపు నాటో కూడా ఉక్రెయిన్‌కు శీతాకాలంలో సాయంపై ఇటీవల సమావేశమైంది.
రష్యా ‘డ్రాగన్స్ టీత్’ వ్యూహం..:ఉక్రెయిన్ సేనలు వేగంగా ముందుకు రాకుండా రష్యా లుహాన్స్క్ ప్రాంతంలో ‘డ్రాగన్స్ టీత్’ వ్యూహం అమలు చేస్తోంది. దీనిలో త్రికోణంలో భారీ బరువు ఉన్న దిమ్మలను రెండు వరుసలో కిలోమీటర్ల మేరకు పాతిపెడతారు. వీటి చుట్టుపక్కల మందుపాతరలను అమరుస్తున్నారు. ఈ పనిని లుహాన్స్క్ ప్రాంతంలో రష్యా కిరాయి సైన్యమైన వాగ్నార్ గ్రూప్ చేస్తోంది. ట్యాంకులు, సైనిక వాహనాలు వేగంగా వీటిని దాటి రాలేవు. ఇది రక్షణాత్మ వ్యూహం. రెండో ప్రపంచ యద్ధంలో నాజీ జర్మనీపై రష్యన్లు ఈ వ్యూహాన్నే అనుసరించారు. ఎముకలు కొరికే చలికి తోడు డ్రాగన్స్ టీత్ వంటి అవరోధాలతో ఉక్రెయిన్ సేనలు ముందుకు రాకుండా అడ్డుకొంటే.. ఇప్పటికే ఆక్రమించుకొన్న భూభాగాల రక్షణను బలోపేతం చేసుకోనే సమయం రష్యాకు లభిస్తుంది.