టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన భారత జట్టు ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 134 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీ జట్టు మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో తెంబా బవుమా సేన గ్రూప్-2లో అగ్రస్థానానికి చేరుకుంది. దక్షిణాఫ్రికా గెలుపుతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు అడుగంటాయి. భారత్‌పై విజయం సాధించిన దక్షిణాఫ్రికా 5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. చెరో నాలుగు పాయింట్లతో భారత్, బంగ్లాదేశ్ జట్లు వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. రెండు పాయింట్లతో కింది నుంచి రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్ ఇక సెమీస్ చేరుకోవడం దాదాపు అసాధ్యం.
ఇక ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 134 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్టు కనిపించినప్పటికీ ఆ తర్వాత మాత్రం పుంజుకుంది. ముఖ్యంగా మార్కరమ్, డేవిడ్ మిల్లర్ క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఇద్దరూ అర్ధ సెంచరీలతో అదరగొట్టి జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించారు. మార్కరమ్ 41 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 52 పరుగులు చేసి అవుట్ కాగా, డేవిడ్ మిల్లర్ 46 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా, షమీ, పాండ్యా, అశ్విన్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (9), రోహిత్ శర్మ (15), కోహ్లీ (12), దీపక్ హుడా (0), హార్దిక్ పాండ్యా (2), దినేశ్ కార్తీక్ (6) దారుణంగా విఫలమయ్యారు. అశ్విన్ 7, భువనేశ్వర్ 4, అర్షదీప్ 2 పరుగులు చేయగా, షమీ డకౌట్ అయ్యాడు. ఒక్క సూర్యకుమార్ యాదవ్ మాత్రం క్రీజులో పాతుకుపోయి సఫారీ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. సహచరులు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా సూర్యకుమార్ మాత్రం బౌలర్లను ఎదుర్కొని 68 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 6 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. భారత బ్యాటింగ్‌ను కకావికలు చేసి 4 వికెట్లు పడగొట్టిన లుంగి ఎంగిడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. నవంబరు 2న భారత్ తన తర్వాతి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడుతుంది.